న్యాయ ధ్వజవాహకులుగా నిలబడండి – డా. ఖాలీద్ ముబష్షీర్
మానవ సమాజంలో న్యాయం, సమానత్వం మరియు సౌభ్రాతృత్వం విలువలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జమాతే ఇస్లామి హింద్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఖాలీద్ ముబష్షీర్ పేర్కొన్నారు. ఈ రోజు నగరంలోని మదుర్ బస్తీ, పోస్ట్ ఆఫీస్ సెంటర్‌లో నిర్వహించిన జమాతే ఇస్లామి హింద్ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సృష్టికి కర్త అయిన దేవుడు ఒక్కడే, అందువల్ల మానవులందరూ పరస్పరం సోదరులని భావించి, కుల మతాలకు అతీతంగా సమాజంలో ప్రతిఒక్కరూ కలిసి మెలిసి జీవించేలా చేయడం అనివార్యమని అన్నారు. జమాత్ కార్యకర్తలు న్యాయం కోసం పాటుపడుతూ, సామాజిక సమానత్వం సాధించేందుకు న్యాయ ధ్వజవాహకులుగా నిలవాలని పిలుపునిచ్చారు.
అదేవిధంగా సమాజం ఒక శరీరంలా ఉంటుందని, అందులో ఒక భాగం నొప్పి పడితే మొత్తం శరీరానికీ బాధ కలుగుతుందని చెప్పారు. సమాజంలో ఎవరికైనా న్యాయం లేకపోతే అది మొత్తం సమాజానికి నష్టం అని డాక్టర్ ఖాలీద్ అన్నారు. అందుకే సమాజంలో ధర్మం, న్యాయం, సమాన హక్కుల కోసం నిరంతరం పోరాడాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు అబ్దుల్ మజీద్ షోహేబ్ మాట్లాడుతూ, జమాతే ఇస్లామి హింద్ ఒక స్వచ్ఛంద ధార్మిక సేవాసంస్థగా గత 75 సంవత్సరాలుగా కుల మత భేదాలు లేకుండా సమాజానికి సేవలు అందిస్తూ, శాంతి, సౌహార్దం నెలకొల్పేందుకు కృషి చేస్తోందని తెలిపారు. ప్రతి కార్యకర్త సమాజ హితం కోసం నిరంతరం కృషి చేయాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో జమాత్ కార్యదర్శి నయీముద్దీన్, జిల్లా అధ్యక్షుడు ఫారూఖ్ యజ్దానీ, పట్టణ అధ్యక్షుడు జహంగీర్, అబ్దుల్ బాసిత్, షబ్బీర్ హుస్సేన్, ముజాహిద్, జిల్లా అధ్యక్షురాలు పర్వీన్ సుల్తానా, షేహనాజ్, ఏజాజ్, నష్రా తదితరులు పాల్గొన్నారు. సమావేశం విజయవంతంగా కొనసాగింది.
Post a Comment