నిత్య పెళ్లి కూతురు ఇప్పటివరకు 12 మంది పురుషులతో వివాహం!
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక్కసారిగా సంచలనం రేకెత్తించిన నిత్య పెళ్లి కూతురు వ్యవహారం బయటపడింది. నిత్య పెళ్లి కొడుకుల నాటకాల గురించి ఇంతవరకు విన్నాం కానీ.. ఇప్పుడు అదే మాదిరి ఓ మహిళ పెళ్లే పనిగా పెట్టుకొని సృష్టిస్తున్న కలకలం సంచలనం సృష్టిస్తోంది.
12 పెళ్లిళ్లు.. లక్ష్యంగా విడాకులు తీసుకున్నవాళ్లు!
రామచంద్రాపురం ప్రాంతానికి చెందిన బేతి వీర దుర్గా నీలిమ అనే మహిళ ఇప్పటి వరకు ఏకంగా 12 మంది పురుషులతో వివాహాలు చేసుకున్నట్టు సమాచారం. కానీ ఆమె వివాహం చేసుకునే ముందు వారి గురించి కచ్చితమైన ప్లాన్ వేసేదట. ముఖ్యంగా ఆర్థికంగా స్థిరంగా ఉండే, విడాకులు తీసుకొని డిప్రెషన్లో ఉన్న పురుషుల్ని టార్గెట్ చేసుకుని మాయ మాటలతో బోల్తా కొట్టించేది.
బ్యాక్అప్ టీం.. గ్యాంగ్ తో పని!
నీలిమ ఈ దందాలో ఒంటరిగా లేదు. ఆమె వెనుక ఓ ముఠా కూడా ఉంది. ఆమె తల్లి బేతి వీరలక్ష్మి, రామకృష్ణ, కల్యాణ్ అనే ముగ్గురు వ్యక్తులు ఈ వ్యవహారంలో నీలిమకు సహకరిస్తున్నారు. ఒకరి తర్వాత మరొకరిని టార్గెట్ చేస్తూ, వివాహం పేరిట నమ్మించి, కొంతకాలం మాయ చేసి, తర్వాత వారి దగ్గర డబ్బులు దోచుకుని మాయమవుతోంది. బాధితులు ఏదైనా ఎదురుతిరిగితే నకిలీ కేసులు పెడుతూ వేధింపులకు గురిచేస్తుందట.
ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితులు
ఈ వ్యవహారం చివరకు పోలీసుల దృష్టికి చేరింది. నరసాపురం, పాలకొల్లు, కొవ్వూరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు బాధితులు కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావును కలిసి ఫిర్యాదు చేశారు. తాము ఎలా మోసపోయామో, ఎలా డబ్బులు దోచుకున్నదో, ఎలా బెదిరింపులకు గురయ్యామో వివరించారు. ఇప్పటి వరకు బాధితుల సంఖ్య మరింత ఉండే అవకాశం ఉంది.
పోలీసుల దర్యాప్తు ప్రారంభం
ఈ ఫిర్యాదులపై స్పందించిన పోలీసులు నీలిమ గ్యాంగ్‌పై దర్యాప్తు ప్రారంభించారు. అసలు విషయం ఏమిటో, ఇంతవరకు ఎంతమందిని మోసం చేసిందో, ఎంత మొత్తాన్ని వసూలు చేసిందో అన్న అంశాలపై స్పష్టత కోసం విచారణ కొనసాగుతోంది. బాధితుల వాంగ్మూలాలతో పాటు డిజిటల్ ఆధారాలు కూడా సేకరిస్తున్నారు.
నిత్య పెళ్లి కూతురు పేరిట మోసాలపాలవుతున్న పురుషులు ఒక్కసారి ఆలోచించాలని, ఫోన్, సోషల్ మీడియా ద్వారా ఏర్పడే సంబంధాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ తరహా సంఘటనలు పెరిగిపోతున్న తరుణంలో, మానసికంగా, ఆర్థికంగా చితికినవాళ్లు ఎవరినైనా విశ్వసించే ముందు పూర్తి సమాచారం సేకరించాల్సిన అవసరం ఎంతైనదీ స్పష్టమవుతోంది.
Post a Comment