-->

సొంతిల్లు ఇవ్వమంటే.. క్వాటర్లు నిర్మిస్తాం అంటున్న సింగరేణి యజమాన్యం!

 

సొంతిల్లు ఇవ్వమంటే.. క్వాటర్లు నిర్మిస్తాం అంటున్న సింగరేణి యజమాన్యం!

కామ్రాడ్ రియాజ్ అహ్మద్ – హెచ్‌.ఎం.ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు

సింగరేణి సంస్థలో ఉద్యోగుల కోసం సొంతిల్లు పథకం అమలు చేయమన్నా, యాజమాన్యం మరోవైపు కోట్లాది రూపాయలతో క్వాటర్లు నిర్మించేందుకు కసరత్తు చేస్తోందని హెచ్‌ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కామ్రాడ్ రియాజ్ అహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీరాంపూర్, మణుగూరు, భూపాలపల్లి, గోదావరిఖని ఏరియాలలో మొత్తం 1,003 క్వాటర్ల నిర్మాణానికి రూ.450 కోట్లు మంజూరు చేయడాన్ని ఆయన ఉదహరించారు. ఒక్క క్వార్టర్‌కి సుమారుగా రూ.44 లక్షల ఖర్చు వస్తోంది అని వివరించారు.

సొంతిల్లు అమలే సరైన మార్గం!

ఈ సందర్భంగా అర్జీ-3 బ్రాంచ్ కమిటీ సమావేశం 8 ఇంక్లైన్ కాలనీలోని హెచ్‌.ఎం.ఎస్ కార్యాలయంలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ – "విశ్లేషణాత్మక లెక్కలతో, ప్రభుత్వానికి భారంగా కాకుండా కార్మికులకు సొంతిల్లు అందించే మార్గం ఉన్నట్లు గతంలో అనేకసార్లు యాజమాన్యానికి, ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించాం. అయినప్పటికీ, వందల కోట్లతో కొత్త క్వాటర్లు కట్టడం వెనక ప్రయోజనాలేమిటో ప్రజలకు స్పష్టంగా చెప్పాలి" అని డిమాండ్ చేశారు.

పాత క్వాటర్లు కూల్చి కొత్తవి.. మరి ఖర్చు?

సింగరేణి పరిధిలో దాదాపు 60 శాతం క్వాటర్లు 50 ఏళ్ల పైబడినవే. అవి కూల్చి ప్రతి చోటా కొత్త డబుల్ బెడ్‌రూమ్ క్వాటర్లు కడతామంటే వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. ఇది కంపెనీకి భారంగా మారే అవకాశం ఉన్నా, సొంతిల్లు పథకాన్ని అమలు చేస్తే ఉద్యోగులు, కంపెనీ, ప్రభుత్వం – అందరికీ లాభమే అని హెచ్‌ఎంఎస్ భావిస్తోంది.

"ఒక ఎకరం స్థలం ఇవ్వండి – మేమే చూపిస్తాం!"

ఈ నేపథ్యంలో రియాజ్ అహ్మద్ సంచలన ప్రకటనా చేశారు.

> “మాకు ఒక ఎకరం స్థలం చూపించండి. ఒక్క కార్మికుడికి రూ.25 లక్షలలో ఇల్లు వచ్చేలా మేమే నిర్మించి చూపిస్తాం. ఎటువంటి కంపెనీ బాదరబందీ లేకుండా, ప్రభుత్వానికి పేరుతెచ్చేలా మా వద్ద స్పష్టమైన పథకం ఉంది.”

అలాగే అన్ని ఏరియాల వారీగా తమ యాజమాన్యం ప్రణాళికను పరిగణలోకి తీసుకొని, కార్మికులకు అర్థవంతమైన, శాశ్వతమైన భవిష్యత్తును ఇవ్వాలని యాజమాన్యాన్ని కోరారు. ఇదే విషయాన్ని అధికారిక లెక్కలతో వినతిపత్రాల ద్వారా అనేకసార్లు వివరించినట్లు తెలిపారు.

ఈ సమావేశంలో ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ, కొమ్ము మదనయ్య, వీరయ్య, మల్లరెడ్డి, అయాజుద్దీన్, రాజేందర్, రాజశేఖర్, డేవిడ్, రాజు తదితర నాయకులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.