వ్యవసాయ కూలీకి 50 లక్షల విలువైన వజ్రం లభ్యం!
కర్నూలు, ఉమ్మడి కర్నూలు జిల్లా వజ్రాల వేటకు మరోసారి వేదికగా మారింది. మొన్నటి తొలకరి జల్లులు పడగానే, వజ్రాల ఆశతో ప్రజలు పొలాల్లో జల్లెడ పడుతున్నారు. ప్రత్యేకించి తుగ్గలి, జొన్నగిరి, ఎర్రగుడి, పగిడిరాయి వంటి గ్రామాలు ఈ వేటలో ముందుంటాయి. ఈ నేపథ్యంలో తుగ్గలి మండలం పెండేకల్లు గ్రామానికి చెందిన ఓ వ్యవసాయ కూలీ అదృష్టవంతుడిగా నిలిచాడు.
వ్యవసాయ పనుల్లో ఉన్న సమయంలో భూమిలో మిలమిల మెరిసే ఓ రాయి అతని కంటపడింది. మొదట అది సాధారణ రాయి అని భావించిన అతను, దానిని ఒక వ్యాపారికి చూపించాడు. పరిశీలించిన వ్యాపారి అది వజ్రం అని నిర్ధారించాడు. వెంటనే ఆ వజ్రాన్ని పది లక్షలకు తనకు అమ్మమని కోరాడు. అయితే ఆ కూలీ ఆ ఆఫర్‌ను తిరస్కరించి వజ్రాన్ని తన వద్దే ఉంచుకున్నాడు.
స్థానిక నిపుణుల అంచనాల ప్రకారం, బహిరంగ మార్కెట్లో ఈ వజ్రానికి కనీసం రూ.50 లక్షల విలువ ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ సమాచారం వ్యాపారులకు తెలిసిన వెంటనే, వజ్రాన్ని కొనుగోలు చేసేందుకు కూలీ ఇంటి వద్ద క్యూ కడుతున్నారు. ఒక్క వజ్రం తన జీవితాన్ని మార్చేయబోతుందని ఆశతో ఆ కూలీ సంబరాలు చేసుకుంటున్నాడు.
ఇటువంటి వజ్రాల వేట ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రతి వర్షాకాలంలో ఓ సంప్రదాయంలా మారింది. వందలాది మంది ప్రజలు తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు పటిష్టంగా పొలాల్లో గాలించడమే ఇందుకు నిదర్శనం. ఇటీవల వరకూ ఊహగా భావించిన వజ్రాల కథలు, ఇలాంటివి జరగడం ద్వారా నిజమని ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది.

Post a Comment