కల్తీ పాల కేంద్రాలపై ఎస్ఓటి పోలీసుల దాడులు – ఇద్దరు అరెస్ట్
భువనగిరి జోన్ పరిధిలో కల్తీ పాలు తయారీ, సరఫరా చేసే అక్రమ కేంద్రాలపై ఎస్‌ఓటీ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. రెండు ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో రెండు కేసులు నమోదు కాగా, ఇద్దరిని అరెస్ట్ చేశారు.
మొట్టమొదటగా మొన్నేవరిపంపు గ్రామంలో దాడి చేసిన పోలీసులు… 80 లీటర్ల కల్తీ పాలు, 500 మిల్లీలీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, ఐదు ప్యాకెట్లు మిల్క్ పౌడర్, 400 మిల్లీలీటర్ల యాసిటిక్ యాసిడ్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కల్తీ పదార్థాలను సరఫరా చేస్తున్న సామల సత్తిరెడ్డిని అరెస్ట్ చేశారు. అతను ఎల్బీనగర్, ఉప్పల్ పరిధిలోని స్వీట్ షాపులకు కల్తీ పాలు సరఫరా చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. అనంతరం సత్తిరెడ్డిని భువనగిరి రూరల్ పోలీసులకు అప్పగించారు.
అదే విధంగా, భువనగిరి మండలంలోని కనుముక్కల గ్రామంలో మరో కల్తీ పాల కేంద్రంపై దాడులు నిర్వహించారు. మలక్‌పేట, దిల్సుక్‌నగర్ ప్రాంతాల్లోని స్వీట్ షాపులకు కల్తీ పాలు విక్రయిస్తున్న కుంభం రఘును పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 100 లీటర్ల కల్తీ పాలు, 200 మిల్లీలీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 7 ప్యాకెట్లు మిల్క్ పౌడర్ స్వాధీనం చేసుకున్నారు.
పాల కల్తీకరణ ఆరోగ్యానికి అత్యంత హానికరమని అధికారులు హెచ్చరించారు. ఈ రకమైన చర్యలపై నిరంతరం గట్టి నిఘా కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.
Post a Comment