-->

ఎల్బీ స్టేడియంలో ‘సామాజిక న్యాయ సమరభేరి’ సభకు సిద్ధం

ఎల్బీ స్టేడియంలో ‘సామాజిక న్యాయ సమరభేరి’ సభకు సిద్ధం


హైదరాబాద్‌, జై బాపూ – జై భీమ్ – జై సంవిధాన్ కార్యక్రమం కింద టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న “సామాజిక న్యాయ సమరభేరి” సభకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదిక కానుంది. శుక్రవారం జరగనున్న ఈ భారీ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా పాల్గొంటుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఇప్పటికే ఖర్గే గురువారం సాయంత్రం నగరానికి చేరుకోగా, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు రేవు మహేశ్‌గౌడ్‌ తదితరులు ఘన స్వాగతం పలికారు.

భారీ జనసంద్రానికి ఏర్పాట్లు పూర్తి

ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా 40,000 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నారు. ముఖ్యంగా 12,500 గ్రామ శాఖ అధ్యక్షులు, మండల, జిల్లా స్థాయి కమిటీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొననున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 500 మంది చొప్పున కార్యకర్తలను తరలించేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడంతో పాటు, మంత్రుల పర్యవేక్షణలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.

సభకు ముందుగా కీలక సమావేశాలు

శుక్రవారం ఉదయం ఖర్గే గాంధీభవన్‌లో పీఏసీ (రాజకీయ వ్యవహారాల కమిటీ), టీపీసీసీ విస్తృత కార్యవర్గ భేటీల్లో పాల్గొంటారు. రాష్ట్ర నేతలకు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్న ఆయన, పార్టీలో సమగ్ర సమన్వయానికి పిలుపునివ్వనున్నారు. సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, మీనాక్షి నటరాజన్, మహేశ్‌గౌడ్ తదితరులు పాల్గొంటారు.

ఎల్బీ స్టేడియంలో వేదిక సిద్ధం

సభ వేదిక ఏర్పాట్లను మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ గురువారం సాయంత్రం పరిశీలించారు. వర్షాభావం లేకుండా ప్రత్యేక షామియానాలు ఏర్పాటు చేశారు. వేదిక, ప్రతినిధుల కూర్చోవడానికి వేరువేరు విభాగాలను ఏర్పాటు చేయడంతో పాటు, ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. స్టేడియం పరిసరాల్లో భారీగా కటౌట్లు, ఫ్లెక్సీలు వెలిసాయి.

GHMC పరిధిలోనుంచి 25,000 మంది తరలింపు

జీహెచ్ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల నుంచే 25 వేల మందికి పైగా తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్టేడియం చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్టు సమాచారం.

Blogger ఆధారితం.