మందమర్రి విద్యార్థుల అథ్లెటిక్ ప్రతిభకు రాష్ట్ర స్థాయి గుర్తింపు
దురిశెట్టి నిశాంత్, షహబాజ్‌లు సౌత్ జోన్ అథ్లెటిక్ పోటీలకు ఎంపిక సీఐ శశిధర్ రెడ్డి, ఎస్సై రాజశేఖర్ చేతుల మీదుగా ఘన సన్మానం
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన హైదరాబాద్ కృష్ణవేణి టాలెంట్ హై స్కూల్ విద్యార్థులు అథ్లెటిక్స్ రంగంలో ప్రతిభ కనబర్చుతూ రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు.
జూలై 28వ తేదీన లక్షెట్‌పేట పట్టణంలోని మాత్మా గాంధీ జ్యోతిబా పూలే పాఠశాల మైదానంలో నిర్వహించిన జిల్లా స్థాయి సౌత్ జోన్ అథ్లెటిక్ పోటీల్లో ఈ విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. జిల్లా నలుమూలల నుండి 300మందికి పైగా విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీల్లో పోటీ తీవ్రంగా సాగింది.
ఈ సందర్భంగా అండర్-16 జావెలిన్ త్రో విభాగంలో దురిశెట్టి నిశాంత్, అండర్-14 విభాగంలో షహబాజ్ ప్రత్యర్థులను మించి ప్రథమ, ద్వితీయ స్థానాలను సాధించారు. దీంతో వీరు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
విద్యార్థుల విజయాన్ని గుర్తించి, మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్ చేతుల మీదుగా వీరికి ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, “ఆటల ద్వారా ఉన్నత ఉద్యోగాలు పొందవచ్చునీ, సమాజంలో గుర్తింపు పెరుగుతుందని,” విద్యార్థులను ఉత్సాహపరిచారు.
ఆగస్టులో హనుమకొండలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థుల కోచ్ రాం వేణు ను ప్రత్యేకంగా అభినందించారు.
విద్యార్థుల విజయంపై పాఠశాల కరస్పాండెంట్ రాం వేణు, ప్రధానోపాధ్యాయురాలు గుణవతి, ఉపాధ్యాయులు మోకనపల్లి బద్రి, శ్రీజ, షరీనా, శివాని, సదానంద, కృష్ణ మోహన్, వెంకటస్వామి, తదితరులు గర్వం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సంతోషం వ్యక్తం చేశారు.
Post a Comment