ఆహార భద్రత కార్డుల కోసం నిరుపేదల నిరీక్షణ నేడు తీరింది కలెక్టర్ రాహుల్ రాజ్
తూప్రాన్, మెదక్ జిల్లా: నిరుపేద కుటుంబాలకు కొత్త రేషన్ కార్డుల జారీ ద్వారా మేల్కొన్న ఆశల కొలువు నేడు సాకారమైంది. తూప్రాన్ ఎంపీడీవో కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పలు కీలక ప్రకటనలు చేశారు. ఈ సందర్భంగా 45 వేల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయని తెలిపారు. దరఖాస్తు చేసిన నిరుపేదలకు గ్రామ సభలద్వారా, మీసేవ కేంద్రాల ద్వారా వచ్చిన డేటాను పరిశీలించి అర్హులుగా గుర్తించిన వారందరికీ కార్డులు అందించామన్నారు.
ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డి, తహశీల్దార్ చంద్రశేఖర్, ఇతర రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని మూడు నెలల రేషన్ ను ముందుగానే సరఫరా చేసిన ప్రభుత్వం ప్రజల పట్ల చిత్తశుద్ధిని చాటిందన్నారు.
అనంతరం తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ రైతు అగ్రోస్ సేవా కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్, రైతులతో మాట్లాడారు. యూరియా లభ్యతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. "రైతుల అవసరాలకు తగినంతగా యూరియా ఎరువులు జిల్లాలో సిద్ధంగా ఉన్నాయి. ఎరువుల కొరత లేదని రైతులు కూడా ధృవీకరించారు" అని కలెక్టర్ పేర్కొన్నారు.
అలాగే ఎరువుల నిల్వలపై జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ, వ్యవసాయ శాఖ, పోలీస్ అధికారులతో కలిసి జాయింట్ టీంలు తనిఖీలు చేస్తోందని తెలిపారు. బ్లాక్ మార్కెట్ కు యూరియా వెళ్లకుండా ఈపాస్ మిషన్, ఫిజికల్ స్టాక్‌ల ద్వారా కఠిన తనిఖీలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఎరువుల అక్రమ రవాణా విషయంలో శిక్షాత్మక చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆగస్టు మాసానికి ముందస్తుగా యూరియా నిల్వల కోసం ప్రతిపాదన పంపించగా, రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వెంటనే మంజూరు చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు. “రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎరువుల సరఫరా కొనసాగుతుందని, ఎరువుల కొరతకు అవకాశం లేకుండా పర్యవేక్షిస్తున్నాం,” అని కలెక్టర్ రాహుల్ రాజ్ స్పష్టం చేశారు.
Post a Comment