నాగుపామును కొరికి చంపిన ఏడాది బాలుడు
బీహార్: పశ్చిమ చంపారన్ జిల్లాలోని బేతియా పట్టణ పరిధిలో ఓ గ్రామంలో విస్మయకర ఘటన చోటుచేసుకుంది. కేవలం ఏడాది వయసున్న బాలుడు నాగుపామును తన పళ్లతో కొరికి చంపాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
గురువారం మధ్యాహ్న సమయంలో గ్రామానికి చెందిన మహిళ తన ఇంటి వద్ద కట్టెలు సేకరిస్తుండగా, ఆమె ఏడాది కుమారుడు గోవింద ఇంటి ఎదురుగానే ఆడుకుంటున్నాడు. అదే సమయంలో ఓ నాగుపాము అక్కడకు వచ్చి బాలుడి చేతికి చుట్టుకుంది. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి భయపడకుండా, చిన్నారి గోవింద తన పళ్లతో పామును బలంగా కొరికాడు. తల భాగంలో తీవ్ర గాయం పొందిన పాము కొద్ది సేపటిలోనే చనిపోయింది.
ఈ దృశ్యాన్ని చూసిన తల్లి, అమ్మమ్మ గాభరాగా చప్పట్లతో పరిగెత్తారు. గోవింద అనంతరం స్పృహ కోల్పోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా, అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం బేతియాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు.
వైద్యుల ప్రకటన: ఆసుపత్రిలో బాలుడికి తక్షణ చికిత్స అందించిన వైద్యులు, అతని ఆరోగ్యం నిలకడగా ఉందని, శరీరంలో ఏ విధమైన పాము విషం అడుగు కూడా లేదని స్పష్టం చేశారు. "బాలుడి శరీరానికి పాము తాకినా, విషాన్ని రిలీజ్ చేయలేదు. అదృష్టవశాత్తు పాము విషంతో కూడిన కాటు వేయకముందే అది చనిపోయింది" అని వైద్యులు తెలిపారు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, చిన్నారి ధైర్యానికి నెటిజన్లు, స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏడాది వయసులోనే పాము దాడికి పోరాడిన గోవింద అనేకమందికి ఆదర్శంగా నిలిచాడు.
Post a Comment