-->

రాష్ట్ర విద్యుత్ రంగంలో సంస్కరణల యుగానికి శ్రీకారం: మరో డిస్కమ్ ఏర్పాటు ఆదేశాలు

రాష్ట్ర విద్యుత్ రంగంలో సంస్కరణల యుగానికి శ్రీకారం: మరో డిస్కమ్ ఏర్పాటు ఆదేశాలు


హైదరాబాద్‌, రాష్ట్ర విద్యుత్ రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేసేందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ సంస్థల పనితీరు మెరుగుపరచడం, ఆర్థిక స్థిరత సాధించడం, ఉచిత విద్యుత్ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం లక్ష్యంగా ప్రభుత్వంలో గట్టి సంస్కరణలకే శ్రీకారం చుట్టారు.

ఈ మేరకు జూబ్లీహిల్స్ నివాసంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇంధన శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఉన్న **తెలంగాణ నార్తరెన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (NPDCL), సౌదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (SPDCL)**లతో పాటు మరొక కొత్త డిస్కమ్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు.

కొత్త డిస్కమ్ లక్ష్యాలు:

  • వ్యవసాయ విద్యుత్ సరఫరాతో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచిత విద్యుత్ పథకాలను నిర్వహణ.
  • రాష్ట్రమంతా ఒకే యూనిట్‌గా కొత్త డిస్కమ్ పరిధి ఉండేలా ఏర్పాటు.
  • డిస్కమ్‌ల పనితీరు మెరుగుపడి జాతీయస్థాయిలో రేటింగ్‌లను పెంచడం.

ఆర్థిక పునరావాసం & రుణాల పునర్నిర్మాణం:

డిస్కమ్‌లపై ఉన్న భారీ రుణ భారం తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రస్తుతం డిస్కమ్‌లు సుమారు 10 శాతం వడ్డీ రేటుతో తీసుకున్న రుణాలు వల్ల తీవ్రంగా దెబ్బతింటున్నాయని, వీటిని తక్కువ వడ్డీ రేటుతో రీస్ట్రక్చర్ చేయాలని స్పష్టం చేశారు.

సౌర విద్యుత్ దిశగా కొత్త అడుగులు:

  • ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాల్లో సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు.
  • జిల్లా కలెక్టర్లతో కలిసి ప్రతి జిల్లాలో అనువైన ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు.
  • సచివాలయానికి సోలార్ విద్యుత్ సరఫరా కోసం ఆర్ అండ్ బీ శాఖతో సమన్వయం చేయాలని సూచించారు.
  • ఎండాకాలంలో వాహనాల పార్కింగ్ ఇబ్బందుల దృష్ట్యా సోలార్ రూఫ్‌టాప్ షెడ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.

గిరిజన, ఆదివాసీ ప్రాంతాల్లో ‘ఇందిర సోలార్ గిరి జల వికాసం’:

రాష్ట్రంలోని గిరిజన తండాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో వచ్చే మూడేళ్లలో 2,10,000 మంది ఎస్టీ రైతులకు సౌర విద్యుత్ పంపుసెట్లను అందజేసి, 6 లక్షల ఎకరాలకు సాగునీటి సదుపాయం కల్పించేందుకు లక్ష్యాన్ని ఏర్పాటు చేయాలని సీఎం పేర్కొన్నారు.


ఈ సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు విద్యుత్ రంగాన్ని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చేందుకు కీలకంగా నిలుస్తాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Blogger ఆధారితం.