నేడు, రేపు తెలంగాణలో భారీ వర్షాలు! రెడ్ & ఆరెంజ్ అలర్ట్ జారీ
హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా మోస్తరు నుంచి కుండపోత వర్షాలు రాష్ట్రం అంతటా దంచికొడుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నారు.
మంగళవారం అర్ధరాత్రి నుంచి వర్షం ఎడతెరిపిలేకుండా పడుతుండగా, బుధవారం, గురువారం రోజుల్లోనూ హైదరాబాద్ నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
రెడ్ అలర్ట్ - అతి భారీ వర్షాలకు హెచ్చరిక
వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం, రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇందులో భాగంగా అదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్,
ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఈదురుగాలులు, మెరుపులతో వానలు
- రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచనున్నాయి.
- ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశమున్నట్టు తెలిపింది.
- పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు చెట్ల కింద నిలువరాదు, రైతులు సాయంత్రం వేళ పొలాలకు వెళ్లొద్దని సూచించారు.
ప్రజలకు సూచనలు
వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
- అత్యవసరమైతే తప్ప ఇంటినుంచి బయటకు రావొద్దు
- నీటి ప్రవాహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలి
- స్థానిక అధికారుల సూచనలు పాటించాలంటున్నారు.
Post a Comment