ఘోర రోడ్డు ప్రమాదం: లారీ క్యాబిన్‌లో మంటలు.. ముగ్గురు సజీవదహనం
మహబూబాబాద్ జిల్లా, ఖమ్మం - వరంగల్ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున దారుణమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజ్ సమీపంలో రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఢీకొన్న వెంటనే ఒక లారీ క్యాబిన్‌లో మంటలు చెలరేగగా, అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే సజీవదహనం అయ్యారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా, ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
పోలీసుల కథనం ప్రకారం, ఒక లారీ విజయవాడ నుంచి పౌల్ట్రీ ఫీడ్ లోడ్‌తో గుజరాత్‌కు వెళ్తుండగా, మరొక గ్రానైట్ లారీ వరంగల్ నుంచి ఖమ్మం వైపు వస్తోంది. వేగంగా వచ్చి ఢీకొనడంతో వెంటనే మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసి, కాలిపోయిన మృతదేహాలను బయటకు తీశారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ ఘటన నేపథ్యంలో ఖమ్మం – వరంగల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రహదారి పూర్తిగా నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ప్రమాదం పట్ల ప్రజల్లో తీవ్ర విచారం వ్యక్తమవుతోంది. రోడ్లపై వేగం నియంత్రించాలన్న వాదనలు మరోసారి వినిపిస్తున్నాయి.
Post a Comment