-->

💥 జీహెచ్ఎంసీ నిధులు కాజేసిన మహిళా కంప్యూటర్ ఆపరేటర్!

రూ.56 లక్షలు కాజేసి… ఒక్క రోజులోనే తిరిగి జమ చేసిన సుభాషిణి


హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో అవినీతి బాగోతాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా శేరిలింగంపల్లి జోన్‌ పరిధిలోని చందానగర్ సర్కిల్ కార్యాలయంలో మహిళా కంప్యూటర్ ఆపరేటర్ భారీ మొత్తాన్ని కాజేసిన ఘటన సంచలనం రేపుతోంది.

చందానగర్ పౌర సేవా కేంద్రంలో పనిచేస్తున్న సుభాషిణి అనే మహిళా ఆపరేటర్ ట్రేడ్ లైసెన్స్, జనన–మరణ ధృవీకరణ పత్రాలు, ఆస్తి పన్ను దరఖాస్తులు వంటి సేవల కోసం ప్రజల నుండి వసూలు చేసిన డబ్బును జీహెచ్ఎంసీ ఖజానాలో జమ చేయకుండా తన వద్దే దాచుకున్నట్టు ఆడిట్ అధికారులు గుర్తించారు.

2024–25 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఆమె రూ.56 లక్షలు కాజేసినట్టు ఆడిట్ నివేదికలో తేలింది. ఆడిట్ జరుగుతుందనే సమాచారం అందుకున్న సుభాషిణి విధులకు హాజరు కావడం మానేయడంతో అధికారులు అనుమానాస్పదంగా భావించి బలవంతంగా కార్యాలయానికి రప్పించారు. విచారణలో సుభాషిణి తన తప్పును అంగీకరించాల్సి వచ్చింది.

ఆమె కాజేసిన మొత్తం రూ.56 లక్షలను కేవలం ఒక్క రోజులోనే జీహెచ్ఎంసీ ఖాతాలో తిరిగి జమ చేయడం ఈ వ్యవహారంలో మరింత చర్చనీయాంశమైంది.

ఈ ఘటన జీహెచ్ఎంసీ లోపలి లావాదేవీల పర్యవేక్షణలో ఉన్న లోపాలను స్పష్టంగా బయటపెట్టిందని ప్రజలు విమర్శిస్తున్నారు. అవినీతి నిరోధక చర్యలు మరింత కఠినతరం చేయాలని పౌరసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793