భారీ వర్షాలకు రైల్వే ట్రాక్ దెబ్బతిన్నది
తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు రవాణా వ్యవస్థను స్తంభింపజేశాయి. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరదనీరు ఉప్పొంగిప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.
జిల్లాలో పరిస్థితులు దృష్ట్యా కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈఓ రాజు, మెదక్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈఓ రాధాకిషన్ విద్యాసంస్థలకు గురువారం సెలవు ప్రకటించారు.
రైల్వే రాకపోకలకు పెద్ద ఆటంకం
కామారెడ్డి జిల్లా భిక్కనూరు–తలమట్ల వద్ద రైల్వే ట్రాక్ కింద ఉన్న కంకర వరద నీటితో కొట్టుకుపోయింది. ట్రాక్ బలహీనమవడంతో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
- విశాఖపట్నం – నాందేడ్ ఎక్స్‌ప్రెస్ : అక్కన్నపేట్ వద్ద మూడు గంటలుగా నిలిచిపోయింది.
- కాచిగూడ – మెదక్ ప్యాసింజర్ : మీర్జాపల్లి వద్ద రెండు గంటలపాటు ఆగిపోయింది.
- నాందేడ్ – మేడ్చల్ ప్యాసింజర్ : కామారెడ్డి వద్ద రెండున్నర గంటలుగా నిలిచిపోయింది.
- ముంబై – లింగంపల్లి దేవగిరి ఎక్స్‌ప్రెస్ : నిజామాబాద్ వద్ద గంటన్నర నిలిచిపోయింది.
- భగత్ కి కోఠి – కాచిగూడ ఎక్స్‌ప్రెస్ : నవీపేట్ వద్ద గంటన్నరుగా నిలిచిపోయింది.
రోడ్లు చెరువుల్లా – జనజీవనం స్తంభన
కామారెడ్డి పట్టణంలో బుధవారం ఉదయం నుండి కురుస్తున్న వర్షం రికార్డు స్థాయిలో నమోదైంది. రోడ్లు చెరువుల్లా మారిపోయి, వాహనాలు కదలలేని స్థితి నెలకొంది. ప్రజలు ఇళ్లలోనే ఇరుక్కుపోయారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రాకూడదని అధికారులు హెచ్చరించారు.
Post a Comment