కేవలం నాలుగు గంటలపాటు మాత్రమే సౌండ్ సిస్టమ్ : హైకోర్టు సంచలన ఆదేశాలు
హైదరాబాద్, ఆగస్టు 27: దేశవ్యాప్తంగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు నేడు ప్రారంభం కానున్న వేళ తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉత్సవాల నిర్వహణలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా అధికారులను కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.
సికింద్రాబాద్ ఎంఈఎస్ కాలనీలో తన ఇంటి పక్కనే మండపం ఏర్పాటు చేసి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని ప్రభావతి అనే మహిళ హైకోర్టును ఆశ్రయించగా, ఇదే తరహా ఫిర్యాదులు పలువురు పౌరులు కూడా దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన ధర్మాసనం, గతంలో ఇచ్చిన ఆదేశాలను అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై కోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా నమోదైన నేపథ్యంలో ధర్మాసనం తీవ్రంగా స్పందించింది.
హైకోర్టు స్పష్టం చేస్తూ, విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు ఇస్తున్నప్పుడు స్థానికుల నుంచి వచ్చే వినతులు, ఎదురయ్యే సమస్యలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని పోలీసు, రెవెన్యూ అధికారులను ఆదేశించింది.
హైకోర్టు నిర్దేశించిన కీలక నిబంధనలు:
- సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే సౌండ్ సిస్టమ్ వాడుకోవాలి.
- సౌండ్ డెసిబెల్ స్థాయిని మించకుండా చర్యలు తీసుకోవాలి.
- పాఠశాలలు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాల వద్ద లౌడ్ స్పీకర్లు వాడరాదు.
- సౌండ్ స్థాయిని డెసిబెల్ మీటర్లతో ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి.
- మండపాల కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకూడదు.
- నిమజ్జనం పూర్తయ్యాక మండపాల ప్రాంగణాన్ని నిర్వాహకులు శుభ్రం చేయాలి.
- ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్‌లు సులభంగా వెళ్లేలా మార్గాలను ఖాళీగా ఉంచాలి.
- మండపానికి కరెంట్ కనెక్షన్ పొందడానికి అనుమతి తప్పనిసరి.
- ఇళ్లు, ఆసుపత్రులకు వెళ్లే మార్గాలకు అడ్డంకులు రాకూడదు.
- విగ్రహాలను సాధ్యమైనంత వరకు కమ్యూనిటీ మైదానాలు, బహిరంగ ప్రదేశాల్లో ప్రతిష్టించాలి.
- స్థానికుల ఫిర్యాదులు స్వీకరించేందుకు పోలీస్ స్టేషన్లలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలి.
- మండపాల వద్ద జరిగే ఏదైనా ఘటనకు నిర్వాహకులు పూర్తి బాధ్యత వహించాలి.
Post a Comment