-->

25 లీటర్ల ఆర్మీ మద్యం బాటిల్స్‌ సీజ్‌

 

విశ్రాంత ఆర్మీ ఉద్యోగుల నుంచి తక్కువ ధరకు మద్యం బాటిల్స్‌ సేకరించి అధిక ధరకు విక్రయించే వ్యక్తి అరెస్ట్

మహబూబ్‌నగర్‌: విశ్రాంత ఆర్మీ ఉద్యోగుల నుంచి తక్కువ ధరకు మద్యం బాటిల్స్‌ సేకరించి, వాటిని వినియోగదారులకు అధిక ధరలకు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఎక్సైజ్‌ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు.

జిల్లా ఎక్సైజ్‌ అధికారి సుధాకర్‌ తెలిపిన వివరాల ప్రకారం, జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీలోని వందన విహార్‌ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న సుదర్శన్‌రెడ్డి కొంతకాలంగా ఆర్మీ క్యాంటీన్‌లో లభించే డిఫెన్స్‌ మద్యం బాటిల్స్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేసి, మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నాడని సమాచారం అందింది.

ఈ నేపథ్యంలో శుక్రవారం అతని ఇంటిపై దాడి జరిపిన ఎక్సైజ్‌ అధికారులు, మొత్తం 33 డిఫెన్స్‌ మద్యం బాటిల్స్‌ (సుమారు 25 లీటర్లు) స్వాధీనం చేసుకున్నారు. వాటి అంచనా విలువ రూ.90 వేల వరకు ఉంటుందని తెలిపారు.

సుదర్శన్‌రెడ్డి కార్యకలాపాలపై రెండునెలలుగా నిఘా పెట్టినట్లు అధికారి సుధాకర్‌ తెలిపారు. కొందరు ఆర్మీ ఉద్యోగులు తమ కోటాలో వచ్చిన మద్యం వినియోగించకుండా తక్కువ ధరకు విక్రయిస్తుండగా, వాటిని సుదర్శన్‌రెడ్డి సేకరించి, ఫంక్షన్లు, పార్టీలు నిర్వహించే వారికి గుట్టుగా సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని చెప్పారు.

ఇకపై ఇలాంటి అక్రమ సరఫరాలో పాల్గొనే ఆర్మీ ఉద్యోగులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలో జరిగే ఫంక్షన్లలో డిఫెన్స్‌ మద్యం విక్రయమైతే, ఆ ఫంక్షన్‌ హాల్‌ నిర్వాహకులపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఎవరైనా డిఫెన్స్‌ మద్యం లేదా ఇతర రాష్ట్రాల మద్యం అక్రమంగా విక్రయిస్తున్నట్లు గమనిస్తే 8712658872 నంబర్‌కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

తనిఖీల్లో ఎక్సైజ్‌ సీఐ వీరారెడ్డి, టాస్క్‌ఫోర్స్‌ సీఐ కవిత, ఎస్‌ఐ రాజేందర్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793