అదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు! పలుచోట్ల వరదకు కొట్టుకుపోయిన రోడ్లు
అదిలాబాద్ జిల్లా : ఆగస్టు 28 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండురోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలు రహదారి రవాణాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలోని కుంటాల మండల పరిధిలోని కల్లూర్–కుంటాల రహదారి ప్రమాదకరంగా మారింది.
బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాలతో అందకూర్ అలుగు ఉధృతంగా ప్రవహించడంతో రహదారి పెద్ద ఎత్తున కోతకు గురైంది. రోడ్డుకు ఒక వైపు గణనీయమైన నష్టం కలగడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అదిలాబాద్–హైదరాబాద్ ప్రధాన మార్గం మీదుగా ప్రయాణించే వాహనదారులకు నిర్మల్ పోలీసులు ప్రత్యేక సూచనలు చేశారు.
నిర్మల్ సమీపంలోని కొండాపూర్ బ్రిడ్జి వద్ద నుంచి ఎడమ వైపునకు తిరిగి యూటర్న్ తీసుకుని మామడ, ఖానాపూర్, మెట్, జగిత్యాల, కరీంనగర్ మీదుగా హైదరాబాద్ చేరుకోవాలని సూచించారు. ఈ మార్గాన్ని తప్పనిసరిగా అనుసరించాలని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల వాహనదారులను కోరారు.
ఇక వర్షం పరిస్థితి ఇదే రీతిలో కొనసాగితే కల్లూర్–కుంటాల రహదారి పూర్తిగా తెగిపోవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే వెంకూర్ లోవెల్ వంతెనపై నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది.
Post a Comment