కామారెడ్డి వరద పరిస్థితులపై మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్
కామారెడ్డి, ఆగస్టు 28: కామారెడ్డి జిల్లాలో వరద పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క శనివారం అత్యవసర టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్ట్కర్, కలెక్టర్, ఎస్పీతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారులు జిల్లాలో కురుస్తున్న వర్షాల తీవ్రత, వరద ఉధృతి, ముంపు ప్రభావం, నష్టం వివరాలను మంత్రికి తెలియజేశారు. వర్షం కొంత తగ్గినప్పటికీ ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోరాదని సీతక్క హెచ్చరించారు. ప్రజల ప్రాణాలు రక్షించడం ప్రభుత్వానికి ప్రధాన కర్తవ్యమని స్పష్టం చేశారు.
మంత్రి సీతక్క ఆదేశాలు:
- ముంపు ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు ప్రత్యక్ష పర్యటనలు నిర్వహించాలి.
- లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి, వారికి తక్షణ సహాయం అందించాలి.
- నీటి ముంపు ఉన్న ఇళ్లలోని నీరు బయటకు పంపే చర్యలు చేపట్టాలి.
- విద్యుత్, వ్యవసాయ, మంచినీటి సరఫరా, పంచాయతీరాజ్ శాఖలు వెంటనే నష్టాన్ని అంచనా వేసి నివేదిక ఇవ్వాలి.
- క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండి ప్రజలకు మనోధైర్యం కల్పించాలి.
- శానిటేషన్ పనులను వేగవంతం చేసి వ్యాధులు వ్యాప్తి చెందకుండా చూడాలి.
- వాగులు, చెరువుల వద్దకు ప్రజలు వెళ్లకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలి.
- ముందస్తు హెచ్చరికలు జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేయాలి.
- ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా అత్యంత జాగ్రత్తలు పాటించాలి.
మంత్రి సీతక్క మాట్లాడుతూ, “ప్రజల ప్రాణాలకు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలి. వాతావరణం అనుకూలించగానే స్వయంగా జిల్లాకు వచ్చి పరిస్థితులను పరిశీలిస్తాను” అని హామీ ఇచ్చారు.

Post a Comment