వరద ప్రభావిత జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
వరద ప్రభావిత జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
హైదరాబాద్, ఆగస్టు 28: తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న కుండపోత వర్షాల నేపథ్యంలో ప్రజల భద్రత కోసం అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పురాతన ఇళ్లలో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు సూచనలు అందుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వానలతో పంటలకు తీవ్ర నష్టం కలగడంతో పాటు అనేక ఇళ్లలోకి నీరు చేరింది. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఉదయం 11 గంటలకు ఏరియల్ సర్వే ద్వారా మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల జిల్లాలను పరిశీలించనున్నారు.
ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి సహా పది జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు ప్రకటించారు.
బుధవారం సాయంత్రం జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఇబ్బందులు రాకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆయన స్పష్టం చేశారు.

Post a Comment