గుబ్బా ఫార్మా కోల్డ్ స్టోరేజీలో భారీ అగ్ని ప్రమాదం
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారం వద్ద గుబ్బా ఫార్మా కోల్డ్ స్టోరేజీలో బుధవారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రాంతమంతా దట్టమైన పొగకు నిండి ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం ఘటనా స్థలానికి చేరుకుని పది ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తోంది.
ప్రమాదం సంభవించిన సమయంలో కోల్డ్ స్టోరేజ్ లో సుమారు 20 మంది కార్మికులు పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు అధికారులు తెలియజేయలేదు. అయితే స్టోరేజ్ లో రెడ్డి ల్యాబ్స్, అరబిందో, హెటిరో వంటి ప్రముఖ ఔషధ కంపెనీలకు చెందిన రసాయన పౌడర్ సుమారు 300 టన్నులకుపైగా నిల్వ ఉండడంతో మంటలు ఎక్కడి నుంచైనా పేలుడుకు దారితీయవచ్చని అగ్నిమాపక శాఖ హెచ్చరించింది.
ప్రమాద తీవ్రతను అంచనా వేసిన అధికారులు అప్రమత్తమై, పరిసర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ పేలుడు ప్రమాదం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక అధికార యంత్రాంగం సూచించింది.
ప్రస్తుతం ఘటనపై మరింత సమాచారం కోసం అధికారులు దర్యాప్తు ప్రారంభించగా, మంటల పూర్తి అదుపు కోసం యత్నాలు కొనసాగుతున్నాయి.
Post a Comment