సైనిక హెలికాప్టర్ కూలి, ఇద్దరు మంత్రులతో సహా ఎనిమిది మంది మృతి
ఆఫ్రికా ఖండంలోని ఘనా దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టిన దుర్ఘటన బుధవారం చోటుచేసుకుంది. రాజధాని అక్రా నుంచి ఒబువాసి వైపు ప్రయాణిస్తున్న జెడ్-9 మోడల్ సైనిక హెలికాప్టర్ ఆకస్మికంగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు క్యాబినెట్ మంత్రులతో పాటు మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.
మృతుల్లో ఘనా దేశ రక్షణ మంత్రి ఎడ్వర్డ్ ఒమానే బోమా, పర్యావరణ శాఖ మంత్రి ఇబ్రహీం ముర్తాలా ముహమ్మద్ ఉన్నారని అధికారికంగా ప్రకటించబడింది. అదనంగా, హెలికాప్టర్‌లో ఉన్న పలువురు సీనియర్ సైనికాధికారులు మరియు సిబ్బంది కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది.
హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఏటీసీతో కమ్యూనికేషన్ కోల్పోయింది. ఆ వెంటనే కుప్పకూలిందని అధికార వర్గాలు వెల్లడించాయి. సమాచారం అందుకున్న వెంటనే సహాయ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి. మృతదేహాలను వెలికితీసి ఆసుపత్రులకు తరలించారు.
ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియని సంగతి తెలిసిందే. అయితే, సాంకేతిక లోపమే కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. నిపుణుల బృందం దర్యాప్తు ప్రారంభించింది.
ఘన ప్రభుత్వం ఈ ప్రమాదాన్ని జాతీయ విషాదంగా ప్రకటించింది. గత దశాబ్దంలో జరిగిన అత్యంత విషాదకర విమాన ప్రమాదాల్లో ఇదొకటిగా గుర్తించారు. 2014లో తీర ప్రాంతంలో హెలికాప్టర్ కూలిపోవడంతో ముగ్గురు మృతి చెందగా, 2021లో అక్రా నగరంలో జరిగిన మరో విమాన ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
Post a Comment