యూరియా కోసం లైన్‌లో రైతు అపస్మారక స్థితి – తలకు తీవ్ర గాయం
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని బుర్కితండా గ్రామపంచాయతీ, మల్లమ్మకుంట తండాకు చెందిన రైతు అజ్మీరా లక్క యూరియా కోసం క్యూలైన్‌లో నిలబడిన సమయంలో అపస్మారక స్థితిలో కిందపడడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు.
ఇప్పటికే 20 రోజులుగా యూరియా అందకపోవడంతో, ఇవాళ ఎరువు ఇస్తున్నారని తెలిసి లక్క తన భార్య విజయతో కలిసి ఉదయం లైన్లో నిలబడ్డాడు. గతంలో పక్షవాతం రావడంతో శారీరకంగా బలహీనంగా ఉన్న లక్క, ఎండలో ఎక్కువసేపు నిలబడలేక ఒక్కసారిగా సొమ్మసిల్లి మెట్లపై నుంచి కిందపడి తలకు బలమైన గాయం అయ్యింది.
అక్కడే ఉన్న రైతులు, సిబ్బంది సహాయంతో గాయపడిన లక్కను వెంటనే మరిపెడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
➡️ ఈ ఘటనతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రైతులు యూరియా కోసం పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Post a Comment