తెలంగాణలో త్వరలో అసెంబ్లీ సమావేశాలు: కాలేశ్వరం నివేదికపై ప్రధాన చర్చకు రంగం సిద్ధం!
తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అనంతరం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ విషయంపై కీలకంగా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఇటీవల తీవ్ర చర్చకు దారి తీసిన కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ కమిషన్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో ప్రధాన చర్చ జరగనుంది.
ఈ కమిషన్ నివేదికను జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో రూపొందించిన విషయం తెలిసిందే. మంత్రివర్గం ఈ నివేదికను ఆమోదించిందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ,
"కమిషన్ నివేదికలోని ప్రతి అంశాన్ని మేం శ్రద్ధగా పరిశీలించాం. ఇది ఎవరికైనా కక్ష సాధింపునకు కాదు. ప్రజల హితమే మా లక్ష్యం. అన్ని రాజకీయ పార్టీలకు అసెంబ్లీలో ఈ అంశంపై స్పందించేందుకు అవకాశం ఇస్తాం," అని తెలిపారు.
ఈ నివేదిక ప్రభుత్వమే తయారుచేసిందని కొందరు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ,
"ఇది పూర్తిగా స్వతంత్ర న్యాయ విచారణ కమిషన్ నివేదిక. మేం దీనిలో చొరవ తీసుకోలేదు. నిజాలు బయటకు రావడం ప్రజలకు స్పష్టత కల్పించడానికే ఉద్దేశం," అని చెప్పారు.
భట్టి విక్రమార్క తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ,
"మేడిగడ్డ వద్ద నిర్మించిన కాలేశ్వరం బ్యారేజీలో ప్రాథమికంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించకపోవడంతో ఇది ప్రమాదకర స్థితిలోకి వెళ్లింది. సుమారు లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చైన ఈ ప్రాజెక్టు దుర్వినియోగానికి నిదర్శనంగా మారింది," అని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి, అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. కమిషన్ సూచనల అమలు కోసం భవిష్యత్తు కార్యాచరణ రూపొందించనుంది.
ఈ నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ సమావేశాలు రాజకీయంగా గంభీరమైన చర్చలకు వేదిక కానున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షాలు ఈ నివేదికపై ఎలా స్పందిస్తాయన్నది ఉత్కంఠను కలిగిస్తోంది.
Post a Comment