మద్యం దుకాణాల టెండర్లకు నోటిఫికేషన్ విడుదల దరఖాస్తు రుసుము భారీగా పెంపు
హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో వైన్స్ షాపుల లైసెన్సుల కేటాయింపుకు ఆబ్కారీ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,620 మద్యం దుకాణాలు ఉండగా, వీటి లైసెన్సులు 2025 డిసెంబర్ 1 నుండి 2027 నవంబర్ 30 వరకు అమల్లో ఉంటాయి. ప్రస్తుతం ఉన్న లైసెన్సులు నవంబర్ 30తో ముగియనున్నాయి.
ఈ సారి లైసెన్స్ దరఖాస్తు రుసుమును రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. గతంలో రూ.2 లక్షలు ఉండగా, ఇప్పుడు రూ.3 లక్షలు నాన్ రిఫండబుల్గా నిర్ణయించింది. ఎంపిక ప్రక్రియను లాటరీ పద్ధతిలో నిర్వహించనున్నారు. దరఖాస్తుల సమర్పణలో ఎలాంటి పరిమితులు లేవు. ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా సమర్పించుకోవచ్చు.
లైసెన్స్ ఫీజులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఎంపికైన లైసెన్స్ దారులు 6 స్లాబులుగా లైసెన్స్ ఫీజు చెల్లించే విధానం కొనసాగనుంది.
ప్రభుత్వం 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ సారి కూడా షాపుల సంఖ్య ఖరారు చేసింది. రాష్ట్రంలో మద్యం వ్యాపారం లాభదాయకమైన రంగంగా మారడంతో లైసెన్సుల కోసం పెద్ద ఎత్తున పోటీ నెలకొనే అవకాశముంది. కాగా, దరఖాస్తుల సమర్పణకు సంబంధించిన తుది తేదీలను త్వరలో ప్రకటించనున్నారు.

Post a Comment