బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ప్రజలు బయటికి రావొద్దని హెచ్చరిక
హైదరాబాద్, ఆగస్టు 28: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో తెలంగాణలో పలుచోట్ల వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయి. రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ప్రధానంగా కొత్తగూడెం, భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉందని పేర్కొంది. ప్రజలు అత్యవసరం లేకుండా ఇళ్ల బయటకు రావొద్దని సూచించింది.
ఇకపోతే, ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతుండటంతో సాధారణ జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు తక్షణమే అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
- పురాతన ఇళ్లలో నివసిస్తున్న వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని,
- వాగులు, కాజ్‌వేలు, కల్వర్టులపై రాకపోకలను పూర్తిగా నిలిపివేయాలని,
- చెరువులు, కుంటలకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని,
- అంటువ్యాధులు రాకుండా శుభ్రత పనులు క్రమం తప్పకుండా చేయాలని,
- అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండి, అధికారుల సూచనలను పాటించాలని ప్రభుత్వం మరోసారి విజ్ఞప్తి చేసింది.
Post a Comment