రూ.1.50 లక్షల విలువైన డిఫెన్స్ మద్యం పట్టివేత
మల్కాజిగిరి: నిబంధనలకు విరుద్ధంగా డిఫెన్స్ మద్యం విక్రయాలకు పాల్పడుతున్న వ్యక్తిని మల్కాజిగిరి ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి సుమారు రూ.1.50 లక్షల విలువైన 50 డిఫెన్స్ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.
మల్కాజిగిరి ఎక్సైజ్ ఏఈఎస్ ముకుంద రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం—కుషాయిగూడకు చెందిన వీరస్వాములు (47) సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో డిఫెన్స్ మద్యం అక్రమంగా విక్రయిస్తున్నాడు. డిఫెన్స్ క్యాంటీన్లలో మద్యం తీసుకునే వారితో పరిచయం పెంచుకొని, తక్కువ ధరలకు కొనుగోలు చేసి, మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తూ లాభాలు పొందుతున్నాడు.
ఈ సమాచారం ఆధారంగా ఎక్సైజ్ బృందం — సీఐ చంద్రశేఖర్, కుమారస్వామి, ఎస్‌ఐ సంధ్యారాణి నేతృత్వంలో ఈసీఐఎల్ రోడ్‌లోని వీరస్వామి ఇంటిపై దాడి చేసింది. ఈ దాడిలో డిఫెన్స్ మద్యం బాటిళ్లతో పాటు ఒక ద్విచక్రవాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.
తదుపరి విచారణ నిమిత్తం కేసును మల్కాజిగిరి ఆబ్కారీ పోలీసులకు అప్పగించారు.

Post a Comment