కాళేశ్వరం విచారణలో తొలి అడుగు.. హైదరాబాద్‌కు సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్..!
హైదరాబాద్: కాళేశ్వరం అవినీతి అంశంపై కీలక పరిణామం చోటుచేసుకుంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) డైరెక్టర్ ప్రవీణ్ సూద్ శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. కోఠీలోని సీబీఐ బ్రాంచ్ కార్యాలయంలో ఆయన అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక, NDSA రిపోర్టు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సీబీఐ విచారణ కోరిన విషయం తెలిసిందే. ప్రాజెక్టు రూపకల్పనలో లోపాలు, నాణ్యత లోపం, డిజైన్ తప్పిదాల వలన కాళేశ్వరం నిర్మాణ వైఫల్యం సంభవించిందని నివేదిక స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో కాంట్రాక్టర్లు, అధికారులు, ప్రైవేట్ కంపెనీలతో పాటు ప్రజాప్రతినిధుల పాత్రపై సీబీఐ దర్యాప్తు జరపాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
ప్రవీణ్ సూద్ ఎవరు..?
కర్ణాటక కేడర్‌కు చెందిన 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్. 2023 మే 25న సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన మరో రెండేళ్లు ఆ పదవిలో కొనసాగనున్నారు. సుబోధ్ జైస్వాల్ తరువాత ఈ హోదాలో బాధ్యతలు స్వీకరించిన సీనియర్ అధికారి ఆయన.
విద్య, ప్రస్థానం
1964లో హిమాచల్ ప్రదేశ్‌లో జన్మించిన సూద్, ఐఐటీ ఢిల్లీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి, మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌లో ర్యాంక్ సాధించారు. 1989లో మైసూరులో తొలి పోస్టింగ్‌తో తన విధులను ప్రారంభించి, కర్ణాటకలో అనేక కీలక హోదాల్లో సేవలందించారు.
ప్రతిష్టాత్మక హోదాలు
మారిషస్ ప్రభుత్వానికి మూడు సంవత్సరాలు పోలీసు సలహాదారుగా పనిచేశారు. అనంతరం మైసూర్ పోలీస్ కమిషనర్‌గా, బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా పనిచేశారు. చివరగా కర్ణాటక డీజీపీగా కొనసాగి సీబీఐ డైరెక్టర్ పదవిని అధిరోహించారు.
Post a Comment