-->

ముస్లిం మహిళ రూ. 1,88,888 గణేష్ లడ్డూ మతసామరస్యానికి నిదర్శనం

 

ముస్లిం మహిళ రూ. 1,88,888 గణేష్ లడ్డూ  మతసామరస్యానికి నిదర్శనం

నిర్మల్, సెప్టెంబర్ 07: తెలంగాణలో మతసామరస్యం అద్భుతంగా వెలుగొందింది. నిర్మల్ పట్టణంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా లడ్డూ వేలంలో ఓ ముస్లిం మహిళ అత్యధిక ధరకు లడ్డూను దక్కించుకుని అందరి ప్రశంసలు అందుకుంది.

ఆదర్శనగర్ కాలనీలో గణేష్ నిమజ్జనం సందర్భంగా లడ్డూ వేలం నిర్వహించారు. ఈ వేలంలో అదే కాలనీకి చెందిన ముస్లిం మహిళ అమ్రీన్ పాల్గొని, భారీ మొత్తమైన రూ. 1,88,888 కు లడ్డూను సొంతం చేసుకున్నారు. ఆమె ఈ అడుగు స్థానికులను ఆశ్చర్యపరచడమే కాకుండా, హిందూ–ముస్లిం సోదరభావానికి చిహ్నంగా నిలిచింది. అమ్రీన్‌ను స్థానికులు ఘనంగా అభినందించారు. ఈ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతోంది.

ఇక నిర్మల్ జిల్లాలోని కుంటాల మండలం అంబకంటి గ్రామంలో కూడా ఇలాంటి విశేషం చోటు చేసుకుంది. గణేష్ నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలంలో ఏడవ తరగతి చదువుతున్న ముస్లిం విద్యార్థి రెహమాన్ రూ. 1,111 కు లడ్డూను దక్కించుకున్నాడు. చిన్న వయసులోనే మతసామరస్యానికి ఆదర్శంగా నిలిచిన రెహమాన్‌కు గ్రామస్థులు శుభాకాంక్షలు తెలిపారు.

మరోవైపు, పొరుగున మహారాష్ట్రలోనూ మతసౌహార్దానికి నిదర్శనంగా ఒక ప్రత్యేక సంఘటన చోటుచేసుకుంది. సాంగ్లీ జిల్లా గోట్ఖిండీ గ్రామంలో ముస్లింలు స్వయంగా వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్నారు. 1980లో ప్రారంభమైన ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుండగా, హిందూ–ముస్లింలు కలిసి ఉత్సవాల్లో పాల్గొంటారు.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793