బిట్ కాయిన్ పేరుతో యువతి వల.. రూ. 27 లక్షలకు పైగా స్వాహా!
మ్యాట్రిమోనీలో పరిచయం.. బిట్ కాయిన్ పేరుతో యువతి వల.. రూ. 27 లక్షలకు పైగా స్వాహా! పెళ్లి చేసుకుంటానని మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ ద్వారా పరిచయమైన మహిళ మాటలు నమ్మి ఓ యువకుడు భారీ మోసానికి గురయ్యాడు. బిట్ కాయిన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు వేసిన వలలో చిక్కి ఏకంగా రూ. 27.50 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన చాంద్రాయణగుట్టలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం చాంద్రాయణగుట్టకు చెందిన యువకుడికి ఓ ప్రముఖ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో మహిళ పరిచయమైంది. తాను చెన్నైకి చెందినదాన్ని, ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నానని చెప్పింది. కొంతకాలం చాట్‌లు, వీడియో కాల్‌లతో ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఇదే సమయంలో ఆ యువతి బిట్ కాయిన్ ట్రేడింగ్‌లో భారీ లాభాలు వస్తాయని చెప్పి యువకుడిని ఆకర్షించింది. విడతలవారీగా రూ.27.50 లక్షలు పెట్టుబడిగా పెట్టించాడు. కొద్ది రోజులకు రూ.1.34 కోట్ల లాభం వచ్చిందని చూపించి, విత్‌డ్రా చేసుకోవాలంటే కమీషన్ చెల్లించాల్సి ఉంటుందని ఒత్తిడి చేసింది.
డబ్బు ఇవ్వకపోవడంతో అకౌంట్‌ను బ్లాక్ చేయడంతో యువకుడు విషయం గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.

Post a Comment