-->

ఫీల్డ్‌ తనిఖీ లేకుండానే ఇందిరమ్మ ఇండ్లకు ఆమోదం… 10 మంది హౌసింగ్‌ ఏఈల సస్పెన్షన్‌


ఫీల్డ్‌ తనిఖీ లేకుండానే ఇందిరమ్మ ఇండ్లకు ఆమోదం… 10 మంది హౌసింగ్‌ ఏఈల సస్పెన్షన్‌

హైదరాబాద్: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో తీవ్ర నిర్లక్ష్యం బయటపడింది. ఫీల్డ్‌ తనిఖీలు చేయకుండానే ఇండ్లకు ఆమోదం ఇచ్చిన 10 మంది హౌసింగ్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్ల (AEలు)పై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకుని సస్పెండ్‌ చేశారు.

నిబంధనల ప్రకారం ప్రతి ఏఈ ఒకటి లేదా రెండు మండలాల్లో సుమారు 500 ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి, పనులు నియమాలకు అనుగుణంగా జరుగుతున్నాయా లేదా అన్నది ధృవీకరించాలి. వారి ఆమోదం అనంతరం మాత్రమే ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతుంది.

అయితే జనగాం, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పనిచేస్తున్న కొందరు ఏఈలు గ్రామాలకు వెళ్లకుండానే తమ లాగిన్‌ వివరాలను విలేజ్‌ సెక్రటరీలకు ఇచ్చినట్లు విజిలెన్స్‌ తనిఖీల్లో వెల్లడైంది. ఒకేసారి లేదా నిమిషాల వ్యవధిలోనే రెండు మూడు గ్రామాల్లో ఇండ్లను ఆమోదించినట్లు అధికారులు గుర్తించారు.

ఈ అంశంపై వివరణ కోరగా సంబంధిత ఏఈలు తాము నిబంధనల ప్రకారమే పనిచేశామని పేర్కొన్నారు. అయితే హౌసింగ్‌ కార్పొరేషన్‌ హెడ్‌ ఆఫీసులో జరిగిన విచారణలో 10 మంది ఏఈలు తమ తప్పును అంగీకరించారు.

దీంతో ఆయా జిల్లాల్లో పనిచేస్తున్న వారిని సస్పెండ్‌ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793