మైనారిటీ గురుకుల ఔట్సోర్సింగ్ సిబ్బంది జీతాల కోతపై ఆగ్రహం
ఖమ్మం : మైనారిటీ సంక్షేమ గురుకులాల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల జీతాలను 30 నుండి 40 శాతం తగ్గిస్తూ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవోపై ఉపాధ్యాయ సిబ్బంది తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నో సంవత్సరాలుగా రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా కృషి చేస్తూ ఉత్తమ ఫలితాలను సాధిస్తున్న తమకోసం ప్రోత్సాహం ఇవ్వాల్సిన పరిస్థితిలో, అకస్మాత్తుగా జీతాలు తగ్గించడం అన్యాయమని వారు వాపోయారు. అంతేకాక, ఇప్పటికే రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను ఎటువంటి సమాచారం లేకుండా కోతపెట్టి జమ చేయడం విస్మయానికి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో జీతాలను పెంచాల్సిన అవసరం ఉందని, కానీ కోత విధించడం అమానుషమని పేర్కొన్నారు. వెంటనే పాత జీతాలను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించి కొత్త జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో మైనారిటీ ఔట్సోర్సింగ్ సిబ్బంది ప్రతినిధులు, ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ రీజినల్ సెక్రటరీ మొహమ్మద్ ముజీబ్‌తో కలిసి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కను ఖమ్మంలోని వారి కార్యాలయంలో కలిసి సమస్యను వివరించారు. దీనిపై స్పందించిన ఉపముఖ్యమంత్రి, అంశాన్ని పరిశీలించి తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

Post a Comment