-->

కారుచీకటిలో కాంతిరేఖ – ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ

కారుచీకటిలో కాంతిరేఖ – ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ


గోదావరిఖని, సెప్టెంబర్ 4 : మీలాదున్నబి ﷺ సందర్భంగా గోదావరిఖనిలో జరిగిన సీరతున్నబి సల్లల్లాహు అలైహి వసల్లం కార్యక్రమంలో జమాత్ ఇ ఇస్లామీ హింద్ వైస్ ప్రెసిడెంట్, HMS జాతీయ కార్యదర్శి ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ ప్రసంగిస్తూ ప్రవక్త ముహమ్మద్ ﷺ బోధనలు నేటి మానవ సమాజానికి వెలుగుదారి చూపుతున్నాయని పేర్కొన్నారు.

అరేబియాలో ఇస్లాం పూర్వం అన్యాయం, అజ్ఞానం, స్త్రీలపై దౌర్జన్యం, బలవంతుల అణచివేతలు విస్తరించి ఉన్న చీకటి యుగంలో ప్రవక్త ﷺ మానవత్వానికి దీపస్తంభంలా అవతరించారని ఆయన గుర్తుచేశారు. సమాజంలో న్యాయం, సమానత్వం, కరుణ, దయలకు ప్రవక్త జన్మమే విప్లవమని తెలిపారు.

మహిళలకు గౌరవం, బానిసల విముక్తి, అరబ్–అరబ్ేతరుల మధ్య సమానత్వం, నల్ల–తెల్లజాతుల మధ్య భేదాభిప్రాయాల నివారణ వంటి విప్లవాత్మక మార్పులు ఆయన తెచ్చారని చెప్పారు. మదీనాలో ప్రవక్త ﷺ రూపొందించిన రాజ్యాంగమే ప్రపంచ చరిత్రలో తొలి లిఖితబద్ధమైన సామాజిక ఒప్పందమని, అది ఆధునిక ప్రజాస్వామ్యానికి పునాదిగా నిలిచిందని వివరించారు.

ఆర్థిక రంగంలో వడ్డీ (రిబా)ను నిషేధించి పేదల సంక్షేమం కోసం జకాత్, సదఖా వంటి వ్యవస్థలు ప్రవేశపెట్టారని, సంపద సమాజంలో సమానంగా ప్రవహించాలనే ఆలోచనను ఆయన ఆచరణలో చూపించారని తెలిపారు. ప్రవక్త చివరి హజ్ ప్రసంగమే నేటి మానవ హక్కుల చార్టర్‌కు బీజమని పేర్కొన్నారు.

ప్రపంచం నేటికీ హింస, అసమానత్వం, అన్యాయం, వివక్షలతో నిండిపోయి ఉన్న సమయంలో ప్రవక్త ﷺ బోధనలు మరింత ప్రాసంగికమని, శాంతి, సామరస్యత, క్షమదానం ద్వారా సమాజాన్ని నడిపించే మార్గదర్శకాలు అవుతాయని ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జమాత్ ఇ ఇస్లామీ హింద్ గోదావరిఖని యూనిట్ మాజీ అధ్యక్షుడు మేరాజ్ అహ్మద్, 8 ఇంక్లైన్ కాలనీ జామా మసీదు అధ్యక్షుడు అయాజుద్దీన్, మతపెద్దలు మునవ్వరొద్దీన్, అషాఫఖురహ్మాన్ తదితరులు పాల్గొన్నారు.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793