-->

చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని నడుస్తున్న భారీ డ్రగ్స్ రాకెట్‌

 

చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని నడుస్తున్న భారీ డ్రగ్స్ రాకెట్‌

హైదరాబాద్, సెప్టెంబర్ 06: హైదరాబాద్‌ శివార్లలోని చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని నడుస్తున్న భారీ డ్రగ్స్ రాకెట్‌ను ముంబై పోలీసులు బట్టబయలు చేశారు. ఓ రసాయన ఫ్యాక్టరీ ముసుగులో మాదకద్రవ్యాలు తయారు చేస్తున్న ఈ ముఠాను అదుపులోకి తీసుకొని, సుమారు రూ.12,000 కోట్ల విలువైన మెఫెడ్రోన్ (ఎండీ) డ్రగ్స్‌తో పాటు ముడి రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు.

రహస్య ఆపరేషన్‌లో రట్టు

మహారాష్ట్రలోని మీరా-భయందర్, వసాయి-విరార్ పోలీసు విభాగాలు కొన్నాళ్లుగా ఒక అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాపై నిఘా వేసి, గూఢచారుల సహకారంతో వారాల పాటు రహస్య ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో ముఠా మూలాలు హైదరాబాద్ చర్లపల్లిలో ఉన్నట్లు సమాచారం అందుకోవడంతో, అక్కడి ఫ్యాక్టరీపై మెరుపుదాడి చేపట్టారు.

నకిలీ లైసెన్స్‌తో ఫ్యాక్టరీ

‘వాఘ్దేవి ల్యాబ్స్’ పేరిట నకిలీ లైసెన్స్‌తో నడుస్తున్న ఈ ఫ్యాక్టరీలో అత్యాధునిక పరికరాలను ఉపయోగించి భారీ ఎత్తున డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దాడిలో ఫ్యాక్టరీ యజమాని, రసాయన నిపుణుడు శ్రీనివాస్‌, అతని సహచరుడు తానాజీ పాఠే, ఓ విదేశీయుడు సహా మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు.

భారీ రసాయనాల స్వాధీనం

ప్రాథమికంగా నిందితుల వద్ద నుంచి 100 గ్రాముల ఎండీ డ్రగ్, రూ.25 లక్షల నగదు స్వాధీనం కాగా, ఫ్యాక్టరీలో 32,000 లీటర్ల రసాయనాలు, భారీ ఉత్పత్తి యూనిట్లు కూడా గుర్తించి సీజ్ చేశారు.

పలు రాష్ట్రాలకు సరఫరా

ఈ ఫ్యాక్టరీలో తయారైన మాదకద్రవ్యాలను మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. హైదరాబాద్ కేంద్రంగా ఇంత పెద్ద డ్రగ్ నెట్‌వర్క్ నడుస్తుండటం స్థానికంగా సంచలనం రేపింది.

దర్యాప్తు వేగవంతం

ఈ రాకెట్‌కు సంబంధించిన మరిన్ని అనుబంధాలు, రాజకీయ, వ్యాపార సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793