వైభవోపేతంగా ఖమ్మం గణేష్ శోభాయాత్ర నిర్వహణ
ఖమ్మం, సెప్టెంబర్ 6: ఖమ్మం నగరంలో గణేష్ నిమజ్జనోత్సవాల సందర్భంగా గణేష్ శోభాయాత్రను రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ లతో కలిసి గాంధీచౌక్ వద్ద ప్రారంభించారు.
ఖైరతాబాద్ మహా గణేష్ శోభాయాత్ర ముగిసి గంగమ్మతల్లి ఒడ్డుకు చేరుకున్న తర్వాత, ఖమ్మం నగరంలో శోభాయాత్ర ప్రారంభమైందని చెప్పారు. రాష్ట్రానికి మంచి వర్షాలు కురిసి పంటలు బాగుండాలని, ముఖ్యమంత్రికి గణనాథుడు అభివృద్ధి బాటలో నడిపే శక్తి ఇవ్వాలని ప్రార్థించారు.
అలాగే, గతంలో మున్నేరు వరదల సమయంలో ప్రభుత్వ యంత్రాంగం చేసిన పునరావాస చర్యలను గుర్తుచేస్తూ, కలెక్టర్ నేతృత్వంలో ఖమ్మం జిల్లా పరిపాలన రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి అభినందించారు. నగరంలో ప్రారంభించిన కేబుల్ బ్రిడ్జి, రిటైనింగ్ వాల్, ఖమ్మం ఖిల్లా రోప్‌వే వంటి ప్రాజెక్టులు త్వరగా పూర్తికావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మేయర్ పునుకోల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment