భారీ డ్రగ్స్ ఫ్యాక్టరీ మందుల మాటున రూ.12 వేల కోట్ల దందా
హైదరాబాద్: నగర శివారులోని చర్లపల్లి పారిశ్రామికవాడలో అతిపెద్ద డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని పోలీసులు, ఎన్‌సీబీ సంయుక్త బృందం ఛేదించింది. అత్యవసర మందుల తయారీ ముసుగులో ప్రమాదకరమైన మెఫెడ్రోన్ (మ్యావ్ మ్యావ్) ఉత్పత్తి చేస్తున్న ఫ్యాక్టరీపై శుక్రవారం సాయంత్రం సర్చ్ ఆపరేషన్ నిర్వహించి 12 మందిని అదుపులోకి తీసుకున్నారు.
మహారాష్ట్రలో మొదలైన క్లూ – దేశవ్యాప్త నెట్‌వర్క్ బస్టు
గత నెల 8వ తేదీన మహారాష్ట్రలోని కాశీమీరా ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న బంగ్లాదేశ్‌కు చెందిన యువతి ఫాతిమా మురాద్ షేక్ (23) వద్ద నుంచి 105 గ్రాముల మెఫెడ్రోన్ స్వాధీనం చేయడంతో ఈ దందా బహిర్గతమైంది. ఆమెను విచారించగా రెహ్మాన్ షేక్ అనే వ్యక్తి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు తేలింది.
ఈ లీడ్ ఆధారంగా మహారాష్ట్ర పోలీసులు ‘డెకాయ్ ఆపరేషన్’ ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా 60 ప్రాంతాల్లో దాడులు చేసి పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. ఇదే దర్యాప్తులో భాగంగా అసలు ఉత్పత్తి కేంద్రం హైదరాబాద్‌లోని చర్లపల్లిలో ఉందని సమాచారం అందింది.
చర్లపల్లిలో ‘వాగ్దేవి ల్యాబ్స్’పై దాడి
ఎన్‌సీబీ, మహారాష్ట్ర పోలీసులు సంయుక్తంగా చర్లపల్లి నవోదయ కాలనీలోని వాగ్దేవి ల్యాబ్స్పై దాడి జరిపారు. ఫ్యాక్టరీలో అత్యాధునిక యంత్ర పరికరాలు, భారీ మోతాదులో ముడిసరుకు స్వాధీనం అయ్యాయి. ఫ్యాక్టరీ యజమాని, ఐటీ నిపుణుడు శ్రీనివాస్ విజయ్ ఒలేటి, మరో కీలక నిందితుడు తానాజీ పండరీనాథ్ పట్వారీను అదుపులోకి తీసుకున్నారు.
రూ.12 వేల కోట్ల డ్రగ్స్ ఉత్పత్తి చేసే సామర్థ్యం
ఫ్యాక్టరీలో లభించిన ముడిసరకుతో సుమారు రూ.12 వేల కోట్ల విలువైన మెఫెడ్రోన్ తయారయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం 12 మంది నిందితులను అరెస్ట్ చేసినట్టు మీరా-భయాండర్-వాసాయ్ విహార్ (ఎంబీవీవీ) పోలీసులు అధికారికంగా ప్రకటించారు.
🔴 మందుల తయారీ పేరుతో నడుస్తున్న ఈ డ్రగ్స్ ముఠా బస్టు, దేశవ్యాప్తంగా వ్యాపించిన నెట్‌వర్క్‌పై పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది.

Post a Comment