-->

తెలంగాణ: రైతులకు శుభవార్త.. యూరియా పంపిణీకి మరిన్ని కేంద్రాలు..!!

తెలంగాణ: రైతులకు శుభవార్త.. యూరియా పంపిణీకి మరిన్ని కేంద్రాలు..!!


హైదరాబాద్: రైతులు యూరియా కోసం పడిగాపులు పడాల్సిన రోజులు తగ్గుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆదేశాల మేరకు యూరియా పంపిణీకి అదనపు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వ్యవసాయశాఖ ప్రకటించింది.

వ్యవసాయశాఖ డైరెక్టర్ బి. గోపి ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. యూరియాను పక్కదారి పట్టకుండా పకడ్బందీగా రైతు వేదికల ద్వారా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి 12 వేల యూరియా విక్రయ కేంద్రాలు ఉన్నప్పటికీ.. ఎక్కువ మంది రైతులు ప్రభుత్వ కేంద్రాల వద్దనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుండటంతో రద్దీ పెరుగుతోందని ఆయన చెప్పారు.

రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అదనంగా రాష్ట్రవ్యాప్తంగా 500 రైతు వేదికల ద్వారా యూరియా పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు గోపి వెల్లడించారు. సోమవారం ఉదయం నుండి పలు జిల్లాల్లోని రైతు వేదికల వద్ద రైతులకు యూరియా అందుబాటులో ఉంటుందని తెలిపారు.

యూరియా పంపిణీపై మంత్రి నాగేశ్వర్‌రావు ఆదేశాలతో ఎప్పటికప్పుడు వ్యవసాయశాఖ మానిటరింగ్ చేస్తోందని.. రైతులు గంటల తరబడి క్యూలలో నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, సిబ్బందికి సూచనలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ సీజన్ వరకే రైతు వేదికల్లో యూరియా పంపిణీ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793