హైదరాబాద్ గోల్కొండ సందర్శనకు రోప్ వే నిర్మాణం
హైదరాబాద్: సెప్టెంబర్ 23: హైదరాబాదులో పర్యాటకులకు కొత్త ఆకర్షణ రాబోతోంది. నగరంలోనే తొలి రోప్‌వే నిర్మాణానికి నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) శ్రీకారం చుట్టింది. చారిత్రక గోల్కొండ కోటను చూసిన తరువాత పర్యాటకులు కేవలం 10 నిమిషాల్లోనే టూంబ్స్‌కు చేరుకునేలా 1.5 కిలోమీటర్ల పొడవులో రోప్‌వే నిర్మాణం చేపట్టనున్నారు.
ఈ ప్రాజెక్టు పీపీపీ (PPP) విధానంలో అమలుకానుండగా, దాని రూపకల్పన, సామర్థ్యం, ఖర్చు తదితర అంశాలపై అధ్యయనం చేయడానికి హెచ్‌ఎండీఏ నైట్‌ఫ్రాంక్ సంస్థను కన్సల్టెన్సీగా ఎంపిక చేసింది. ఇంతకుముందు రైట్స్, కేఅండ్‌జే, నైట్‌ఫ్రాంక్ వంటి సంస్థలు టెండర్లలో పాల్గొనగా, నైట్‌ఫ్రాంక్‌కు ప్రాధాన్యం లభించింది. మూడు నెలల్లో నివేదిక సమర్పించిన తరువాత, ఆన్‌లైన్ బిడ్డింగ్ ద్వారా నిర్మాణ సంస్థను ఎంపిక చేయనున్నారు.
గోల్కొండ నుంచి టూంబ్స్ మధ్య రక్షణ శాఖకు చెందిన భూములు ఉండటంతో, రైట్ ఆఫ్ వే సిద్ధం చేయడం, అవసరమైన వనరులపై అధ్యయనం వంటి అంశాలను కూడా ప్రాజెక్టులో భాగం చేశారు. ఇప్పటికే మనాలి, గ్యాంగ్టక్, నలందా, డార్జిలింగ్, ఉదయ్‌పూర్, సిమ్లా వంటి పలు పర్యాటక ప్రాంతాల్లో రోప్‌వేలు విజయవంతంగా నడుస్తున్నాయి.
ప్రతిరోజు దాదాపు 10,000 మంది పర్యాటకులు గోల్కొండ కోటను సందర్శిస్తున్నారు. రోప్‌వే పూర్తయితే పర్యాటకులకు సులభంగా ప్రయాణించే సౌకర్యం కలిగించడంతో పాటు పర్యాటక రంగానికి కొత్త ఊపునిస్తుందని అధికారులు భావిస్తున్నారు.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఖర్చు సుమారు రూ.100 కోట్లు అవుతుందని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేసింది.

Post a Comment