ఆర్టీసీ ఉద్యోగులకు దసరా బహుమతి – అడ్వాన్స్ మంజూరు
హైదరాబాద్: సెప్టెంబర్ 23 : రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. దసరా పండుగను పురస్కరించుకొని ఉద్యోగులకు అడ్వాన్స్ మంజూరు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. డ్రైవర్లు, కండక్టర్లు, సూపర్వైజర్లు, శ్రామిక్‌లు తదితర సిబ్బందికి వారి నెల జీతం ఆధారంగా అడ్వాన్స్ అందించనున్నారు.
ఇది ఉద్యోగుల కోరిక మేరకే తీసుకున్న నిర్ణయమని అధికారులు వెల్లడించారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ విషయంలో ఇప్పటికే ఉన్నతాధికారులతో సమావేశమై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ అడ్వాన్స్‌ను తర్వాత ఉద్యోగుల జీతాల్లో నుంచి విడతల వారీగా కోత విధించి తిరిగి వసూలు చేయనున్నారు.
ఇటీవలి కాలంలో ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు పండుగ సందర్భంగా బోనస్ ఇవ్వాలని నిరంతరంగా డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారి అభ్యర్థనను గౌరవిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.
టీజీఆర్టీసీని లాభాల దిశగా నడిపించేందుకు ప్రభుత్వం, ఉద్యోగులు కలిసి కృషి చేస్తున్నారని సజ్జనార్ పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణ మహాలక్ష్మి పథకం విజయవంతానికి ఉద్యోగుల సహకారం అత్యంత కీలకమని ఆయన తెలిపారు.
దసరా పండుగ సమయానికే ఈ ఆర్థిక సహాయం అందుబాటులోకి రావడంతో ఉద్యోగుల్లో ఆనందం నెలకొంది.

Post a Comment