చిత్తు కాగితాల పేరుతో దొంగతనాలు… ఆరుగురు మహిళల ముఠా అరెస్ట్
యాదగిరిగుట్ట, నవంబర్ 20: యాదగిరిగుట్ట మండలం చొల్లేరు గ్రామంలో చిత్తు కాగితాలు ఏరుకునేందుకు వచ్చామని చెప్పి దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు మహిళలను గ్రామస్తులు పట్టుకునిపోలీసులకు అప్పగించారు. బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది.
గ్రామస్థుల వివరాల ప్రకారం ఒక ఆటోలో ఆరుగురు మహిళలు చొల్లేరు గ్రామానికి చేరుకున్నారు. చేతుల్లో సంచులు పట్టుకుని కాగితాలు ఏరుకుంటున్నట్టు నటిస్తూ గ్రామంలోని వీధులన్నీ తిరిగారు. ఈ క్రమంలో తాళాలు వేసిన ఇళ్ల ఆవరణల్లోకి వెళ్లి ఇత్తడి బిందెలు, ఇత్తడి బకెట్లు, తాంబాలాలు, ప్లేట్లు, అలాగే నిర్మాణంలో ఉన్న ఇళ్లలోని మోటార్లు, డ్రిల్ మిషన్లు, విద్యుత్ వైర్లు వంటి వస్తువులను దోచుకుని తమ సంచుల్లో వేసుకున్నారు.
తరువాత ఆటో వద్దకు వెళ్లి దొంగిలించిన సామగ్రిని లోపల పెట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో గ్రామస్తులు అనుమానం పొంది వారిని అడ్డుకున్నారు. అవాస్తవం బయటపడడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి, మహిళలను వారి చేతిలోనే పట్టుకుని అప్పగించారు.
విచారణలో ఆరుగురు మహిళలు జనగామ జిల్లాకు చెందిన వారని గుర్తించినట్లు సీఐ రమేష్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టుగా చెప్పారు.

Post a Comment