గ్యాస్ సిలిండర్ పేలి మహిళ దుర్మరణం తల్లిదండ్రులకు గాయాలు
హైదరాబాద్, నవంబర్ 23: నగరంలోని అమీర్‌పేట మధురానగర్‌లో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించి ఓ మహిళ దుర్మరణం చెందింది. మధ్యాహ్నం సమయంలో ఇంటిలో గ్యాస్ లీక్ అవుతున్న విషయం గుర్తించకపోవడంతో ఒక్కసారిగా భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో సోనూ బాయి (40) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మృతురాలి తల్లిదండ్రులు గోపాల్ సింగ్, లలిత బాయి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మధురానగర్‌లోని ఓ భవనం మొదటి అంతస్తులో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. పేలుడు శబ్దం విన్న స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా, చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సిలిండర్ మంటలను పూర్తిగా ఆర్పివేశారు.
పేలుడు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గ్యాస్ లీకేజీనే కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.

Post a Comment