ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య..! మూఢనమ్మకాలే కారణమా?
హైదరాబాద్ నగరంలో విషాదం చోటుచేసుకుంది. అంబర్ పేటలోని మల్లికార్జున్ నగర్‌లో ఓ కుటుంబం ఒక్కసారిగా ముగ్గురు ప్రాణాలు తీసుకోవడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దంపతులు శ్రీనివాస్, విజయలక్ష్మి, వారి చిన్న కూతురు శ్రావ్య ఉరేసుకుని మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
మూఢనమ్మకాలే కారణమా?
ప్రాధమిక దర్యాప్తులో భయానక నిజాలు వెలుగు చూస్తున్నాయి. కొన్ని రోజుల క్రితమే వారి పెద్ద కూతురు ఆత్మహత్య చేసుకోవడం కుటుంబంపై తీవ్రమైన మానసిక ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఆమె మరణాన్ని భరించలేకపోయిన దంపతులు తీవ్ర నిరాశలోకి వెళ్లినట్లు వారి పరిచయస్తులు చెబుతున్నారు.
చుట్టుపక్కల వారికి “దేవుడు పిలుస్తున్నాడు… మేమూ మా పెద్ద కూతురు దగ్గరికే వెళ్తాం” అని దంపతులు పలుమార్లు చెప్పినట్లు స్థానికులు చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మూఢనమ్మకాలు, మతపరమైన అపోహలు ఈ ఘటనకు కారణమై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పెద్ద కూతురు మరణంతో బాదపడిన కుటుంబం
మొదటి కూతురు ఆత్మహత్య అనంతరం కుటుంబసభ్యులు తీవ్రంగా కుంగిపోయినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ సంఘటనల నేపథ్యంలో పోలీసులు కుటుంబ మానసిక పరిస్థితి, ఆత్మహత్యకు దారితీసిన కారణాలను వివరణాత్మకంగా పరిశీలిస్తున్నారు.
పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది
ఘటన స్థలం నుండి ఒక సుయిసైడ్ నోట్ దొరికిందా లేదా అన్న విషయంపై పోలీసులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే కుటుంబ సభ్యుల గత ప్రవర్తన, స్థానికుల వాంగ్మూలాలు చూసినపుడు మూఢనమ్మకాలే ఈ విషాదానికి మూలం కావొచ్చని భావిస్తున్నారు.

Post a Comment