రైలుపట్టాలు దాటుతుండగా గొర్రెల మందను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం దారుణ ఘటన చోటుచేసుకుంది. రైలు పట్టాలు దాటిస్తున్న సమయంలో ఎక్స్‌ప్రెస్ రైలు దూసుకువచ్చి గొర్రెల మందను ఢీకొనడంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు వందకు పైగా గొర్రెలు మృత్యువాత పడ్డాయి.
స్థానికుల కథనం ప్రకారం — కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన దర్శపు సుధాకర్ (35) మరో వ్యక్తితో కలిసి ఫైర్ స్టేషన్ సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్ద గొర్రెలను మేపుతున్నాడు. ఈ క్రమంలో రైలుపట్టాలు దాటించే సమయంలో రైలు వస్తుందనే విషయం గమనించకపోవడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా ఎక్స్‌ప్రెస్ రైలు సమీపిస్తుండటాన్ని గ్రహించిన సుధాకర్ భయంతో పక్కనే ఉన్న వాగులోకి దూకాడు.
రైలు దూసుకెళ్లడంతో గొర్రెల మంద మొత్తం చెల్లాచెదురైపోగా, సుమారు వంద గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. వాగులో పడిన సుధాకర్ కనిపించకపోవడంతో గజ ఈతగాళ్ల సహాయంతో తీవ్రంగా గాలించిన అధికారులు చివరికి సాయంత్రం అతడి మృతదేహాన్ని గుర్తించారు.
ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. స్థానికులు ఈ సంఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment