హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్‌మ్యాన్ ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్, డిసెంబర్ 21: హైదరాబాద్ హయత్‌నగర్ ప్రాంతంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు గన్‌మ్యాన్‌గా పనిచేస్తున్న కృష్ణ చైతన్య ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది.
సమాచారం ప్రకారం, కృష్ణ చైతన్య శనివారం ఉదయం తన నివాసంలో తన వద్ద ఉన్న సర్వీస్ తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు వెంటనే గమనించి అతడిని సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ప్రాథమిక విచారణలో, కృష్ణ చైతన్య ఇటీవల ఓ బెట్టింగ్ యాప్‌లో భారీ మొత్తంలో డబ్బులు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులే అతడి ఆత్మహత్యాయత్నానికి కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
విషయం తెలిసిన వెంటనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆస్పత్రికి చేరుకుని గన్‌మ్యాన్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఆర్థిక సమస్యల కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్టు ప్రాథమిక సమాచారం ఉందని, ఈ అంశాన్ని అనవసరంగా సంచలనంగా మార్చవద్దని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Post a Comment