-->

హైదరాబాద్, వరంగల్ నగరాల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఆరుగురు అరెస్టు

కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో ఈగల్ టీమ్ ప్రత్యేక తనిఖీలు గంజాయి, కొకైన్, ఎండీఎంఏ స్వాధీనం


హైదరాబాద్, డిసెంబర్ 21: కొత్త సంవత్సరం వేడుకలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. హైదరాబాద్, వరంగల్ నగరాల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఆరుగురు డ్రగ్ పెడ్లర్లను ఈగల్ టీమ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 330 గ్రాముల గంజాయి, 3 గ్రాముల కొకైన్, 11.5 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు.

ప్రతి ఏడాది కొత్త సంవత్సరం సందర్భంగా డ్రగ్స్ వినియోగం పెరుగుతుండటంతో, డిసెంబర్–జనవరి నెలల మధ్యనే మత్తు పదార్థాల అక్రమ రవాణా 80 నుంచి 90 శాతం వరకు జరుగుతుందని పోలీసుల అంచనా. ఈ నేపథ్యంలో నగరంతో పాటు జిల్లాల్లోనూ విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

ఈ తనిఖీల్లో వరంగల్ జిల్లాలో ముగ్గురు గంజాయి సరఫరాదారులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు 80 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 250 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు.

ప్రాథమిక విచారణలో నిందితులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ విక్రయాల ద్వారా యువతను లక్ష్యంగా చేసుకుని అక్రమంగా లాభాలు ఆర్జిస్తున్నారని వెల్లడించారు.

డ్రగ్స్ నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని, మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగంపై జీరో టాలరెన్స్ విధానంతో ముందుకెళ్తామని పోలీసులు స్పష్టం చేశారు. కొత్త సంవత్సరం వేడుకల వరకు తనిఖీలు మరింత కఠినంగా కొనసాగుతాయని హెచ్చరించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793