వీధి కుక్కల వెంబడింపు… బైక్ నుంచి పడిపడి యువకుడు దుర్మరణం
వరంగల్ జిల్లా, డిసెంబర్ 04: గీసుగొండ మండలం మచ్చాపూర్ గ్రామంలో వీధి కుక్కల దాడి మరో యువకుడి ప్రాణం తీసింది. హన్మకొండలో ఉద్యోగం ముగించుకుని స్వగ్రామమైన ఎలుకుర్తికి తిరిగి వెళ్తున్న ఆడెపు శివకుమార్ (24) పై ఆకస్మికంగా వీధి కుక్కలు దాడికి యత్నించినట్లు స్థానికులు తెలిపారు.
వెంబడిస్తున్న కుక్కల నుండి తప్పించుకోవడానికి శివకుమార్ బైక్‌ను వేగంగా నడపగా, వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న డ్రైనేజీలో పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
స్థానికులు మండిపడుతూ…“రాష్ట్రంలో వీధి కుక్కల బెడద పెరిగిపోతోంది. ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవడం లేదు. పట్టణాల్లోనే కాదు గ్రామాల్లో కూడా పరిస్థితి దారుణంగా ఉంది” అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శివకుమార్ మృతి పట్ల గ్రామస్తులు కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ, అధికారులు వెంటనే వీధి కుక్కల నియంత్రణపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Post a Comment