-->

సత్తుపల్లిలో యూనియన్ బ్యాంక్ సామాగ్రి జప్తు

సత్తుపల్లిలో యూనియన్ బ్యాంక్ సామాగ్రి జప్తు 8 ఏళ్లుగా అద్దె చెల్లించకపోవడంపై హైకోర్టు కఠిన ఆదేశాలు


సత్తుపల్లి, ఖమ్మం జిల్లా: సత్తుపల్లి పట్టణం మెయిన్ రోడ్డులోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖపై కోర్టు కఠిన చర్యలకు ఆదేశించింది. గత 8 సంవత్సరాలుగా అద్దె చెల్లించకుండా ఇంటి యజమానిని ఇబ్బందులకు గురిచేస్తున్న యూనియన్ బ్యాంక్‌పై ఇంటి యజమాని చలసాని సాంబశివరావు హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆదేశాల మేరకు గురువారం బ్యాంకులోని సామాగ్రిని జప్తు చేశారు.

సత్తుపల్లి పట్టణానికి చెందిన చలసాని సాంబశివరావు తనకు చెందిన భవనాన్ని 2013లో అప్పటి ఆంధ్రా బ్యాంకుకు అద్దెకు ఇచ్చినట్లు తెలిపారు. 2013 నుంచి 2018 వరకు మాత్రమే అద్దె ఒప్పందం (అగ్రిమెంట్) కొనసాగిందని, ఆ తరువాత బ్యాంకు అగ్రిమెంట్‌ను రెన్యువల్ చేయించుకోకపోగా అద్దె కూడా చెల్లించకుండా అదే భవనంలో బ్యాంకింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తోందని ఆయన ఆరోపించారు.

ఈ నేపథ్యంలో 2018 నుంచి ఇప్పటివరకు చెల్లించాల్సిన అద్దె బకాయిలు సుమారు రూ. 52 లక్షలు ఉన్నాయని పేర్కొంటూ హైకోర్టులో దావా వేశారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన హైకోర్టు, బ్యాంకు తక్షణమే అద్దె బకాయిలను చెల్లించాలని ఆదేశిస్తూ, 2026 జనవరి 31వ తేదీలోపు పూర్తి బకాయిని చెల్లించి భవనాన్ని ఖాళీ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

అయితే కోర్టు ఉత్తర్వులను కూడా పట్టించుకోకుండా యూనియన్ బ్యాంక్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో, కోర్టు మరింత కఠినంగా స్పందించింది. బ్యాంకులోని సామాగ్రిని జప్తు చేసి, వాటి ద్వారా వచ్చిన మొత్తాన్ని ఇంటి యజమానికి చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.

దీంతో జిల్లా కోర్టు సిబ్బంది గురువారం సత్తుపల్లి పట్టణంలోని యూనియన్ బ్యాంక్ శాఖకు చేరుకుని, బ్యాంకులో ఉన్న కుర్చీలు, టేబుల్స్, కూలర్లు తదితర సామాగ్రిని జప్తు చేశారు. ఈ ఘటన పట్టణంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ సందర్భంగా ఇంటి యజమాని చలసాని సాంబశివరావు మాట్లాడుతూ, “ఎన్నో సంవత్సరాలుగా అద్దె ఇవ్వకుండా బ్యాంకు అధికారులు నన్ను మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేశారు. కోర్టు ఆదేశాల వల్ల న్యాయం లభిస్తుందని ఆశిస్తున్నాను” అని తెలిపారు.

ప్రభుత్వ రంగ బ్యాంక్‌గా ఉన్న యూనియన్ బ్యాంక్ కోర్టు ఉత్తర్వులను విస్మరించడం పట్ల న్యాయవర్గాల్లోనూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనతో అద్దె వివాదాల విషయంలో చట్టాన్ని ఎవ్వరూ అతిక్రమించలేరన్న సందేశం స్పష్టంగా వెళ్లిందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793