జడ్చర్లలో విషాదం : గొంతులో గుడ్డు ఇరుక్కొని వ్యక్తి మృతి
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఓ దుర్ఘటన చోటుచేసుకుంది. ఉడకబెట్టిన గుడ్డు తినే క్రమంలో గుడ్డు గొంతులో ఇరుక్కోవడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి వెలుగులోకి వచ్చింది.
స్థానికుల వివరాల ప్రకారం — జడ్చర్ల పట్టణం, చైతన్యనగర్ కాలనీకి చెందిన పాండుకుమార్ (43) అనే ఆటో డ్రైవర్ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఉడికించిన గుడ్డును మింగే సమయంలో అది గొంతులో ఇరుక్కుపోవడంతో పాండు ఒక్కసారిగా ఊపిరి ఆడక తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి అతడిని జడ్చర్ల సర్కారు దవాఖానకు తరలించారు. అక్కడ డ్యూటీ వైద్యులు చికిత్స అందించినప్పటికీ పాండును కాపాడలేకపోయారు. చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు.
మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనతో పాండు కుటుంబం, పరిసరాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Post a Comment