-->

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో డబ్బు–మద్యం ప్రవాహం

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో డబ్బు–మద్యం ప్రవాహం ఓటర్లకు పండుగ.. ఎన్నికల ముగింపుతో ‘విందు’కు స్వస్తి


హైదరాబాద్ / జిల్లాలు: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలు ముగిసి దాదాపు రెండేళ్లు గడిచిన తర్వాత నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఖర్చుల పరంగా చరిత్ర సృష్టించాయి. ఇంతకుముందెన్నడూ లేనివిధంగా ఈ ఎన్నికల్లో అభ్యర్థులు తమ గెలుపు కోసం విచ్చలవిడిగా ఖర్చు చేసిన పరిస్థితులు కనిపించాయి.

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ఖర్చు లక్షలు కాదు.. నేరుగా కోట్ల రూపాయలకు చేరినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఎన్నికల సంఘం అభ్యర్థుల ఖర్చుపై నియంత్రణ విధించినా, ఆ నియమావళి కాగితాలకే పరిమితమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

డబ్బు, మద్యం, విందుల పందేరం

ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాల్లో ఓటర్లకు డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేశారు. చాలా చోట్ల ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు టీ, టిఫిన్, భోజనాలు ఏర్పాటు చేశారు.
కొన్ని గ్రామాల్లో అయితే మద్యం బాటిళ్లతో పాటు చికెన్, మటన్ బిర్యానీ ప్యాకెట్లు ఇంటింటికీ సరఫరా చేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి.

అభ్యర్థులు సమకూర్చిన విందులతో సుమారు పక్షం రోజుల పాటు ఓటర్లు ఎలాంటి చింత లేకుండా కాలం గడిపారు. సాధారణంగా హోటల్ భోజనాల రుచి తెలియని సామాన్య ప్రజానీకం కూడా ఈ ఎన్నికల వేళ అభ్యర్థుల పుణ్యాన వివిధ రుచులను ఆస్వాదించారు.

కోరుకున్న బ్రాండ్‌.. కోరుకున్న భోజనం

మద్యం ఏరులై పారినట్టుగా పరిస్థితి నెలకొంది. ఓటర్లు కోరుకున్న బ్రాండ్ల మద్యం నేరుగా వారి చెంతకు చేరింది. ఉచితంగా లభించిన మద్యం, బిర్యానీలతో మద్యం ప్రియులు, భోజన ప్రియులు ఈ పక్షం రోజులు పండుగ వాతావరణంలో గడిపారు.

కొంతమంది ఓటర్లు అయితే ఇళ్లలో పొయ్యిలు కూడా వెలిగించకుండా, అభ్యర్థుల ఇళ్ల వద్ద ఏర్పాటు చేసిన విందులకే పరిమితమయ్యారు. ఉదయం టీ నుంచి రాత్రి భోజనం వరకు అంతా అక్కడే సాగింది.

ఎన్నికల ముగింపుతో ‘విందు’ ముగింపు

మూడు విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు బుధవారం ముగియడంతో అభ్యర్థులు డబ్బు, మద్యం పంపిణీకి, బీరు–బిర్యానీ సరఫరాకు స్వస్తి పలికారు.

ఎన్నికల హడావుడితో అభ్యర్థుల వెంట తిరుగుతూ వారి విందులతో కాలం వెళ్లదీసిన ఓటర్లు గురువారం ఒక్కసారిగా కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టయ్యారు. ఇకపై ఎవరి తిండి వారు వండుకోవాల్సి రావడం, మద్యం కావాలంటే తమ జేబు నుంచే ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

దీంతో కొందరిలో ఎటూ తోచని పరిస్థితి నెలకొనగా, మరికొందరు మాత్రం “ఎన్నికలు వస్తేనే పండుగ” అంటూ చర్చించుకుంటున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793