10 నెలల బిడ్డకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య… తట్టుకోలేక నానమ్మ ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్, జనవరి 09: కుటుంబ కలహాలు ఓ పసి ప్రాణాన్ని బలితీసుకున్న హృదయ విదారక ఘటన మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నాలుగేళ్ల క్రితం చార్టెడ్ అకౌంటెంట్ యశ్వంత్ రెడ్డిని వివాహం చేసుకున్న సుష్మ(27)కు, యశ్వవర్ధన్ రెడ్డి అనే 10 నెలల కుమారుడు ఉన్నాడు. ఇటీవల భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఒక ఫంక్షన్‌కు సంబంధించిన షాపింగ్ నిమిత్తం సుష్మ తన తల్లి లలిత(44) ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో ఇంట్లోని మరో గదికి వెళ్లిన సుష్మ, తన 10 నెలల కుమారుడికి విషమిచ్చి, అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడింది.
రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన యశ్వంత్ రెడ్డి, బెడ్‌రూమ్ తలుపు లోపల నుంచి తాళం వేసి ఉండటాన్ని గమనించాడు. అనుమానం వచ్చి తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లగా, భార్యా–కొడుకు విగతజీవులుగా కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
కళ్ల ముందే కూతురు, మనవడి మృతదేహాలను చూసిన తల్లి లలిత తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

Post a Comment