వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానం: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
హైదరాబాద్, జనవరి 26: మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం వేగంగా ముందుకు సాగుతోందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి వేడుకల్లో గవర్నర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్, ‘రైజింగ్ తెలంగాణ–2047’ విజన్ డాక్యుమెంట్ ద్వారా ప్రభుత్వం సరికొత్త అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకుందని తెలిపారు. స్వల్ప కాలంలోనే తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించిందని ప్రశంసించారు. రాజ్యాంగ విలువలను కాపాడుతూ అభివృద్ధి మార్గంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు.
ఆర్థికంగా మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్య సాధన కోసం ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందడుగులు వేస్తోందన్నారు. ఇటీవల విడుదల చేసిన ‘రైజింగ్ తెలంగాణ’ డాక్యుమెంట్ హైదరాబాద్ ప్రతిష్ఠను మరింత పెంచేలా రూపకల్పన చేయబడిందని చెప్పారు. రాష్ట్రాన్ని మూడు ఆర్థిక జోన్లుగా విభజించి, ప్రతి ప్రాంతానికి తగిన అభివృద్ధి నమూనాను అమలు చేస్తున్నట్లు వివరించారు.
తెలంగాణను గ్లోబల్ స్కిల్ హబ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని గవర్నర్ తెలిపారు. యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు ఐటీఐలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా మార్చామని, ఇప్పటివరకు 62 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు వెల్లడించారు. విద్య, ఉపాధి రంగాల్లో తీసుకుంటున్న చర్యలు రాష్ట్ర ఆర్థిక బలాన్ని మరింత పెంచుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని గవర్నర్ స్పష్టం చేశారు. ధాన్యం ఉత్పత్తిలో సాధించిన విజయంతో పాటు రైతులకు ప్రభుత్వం భారీగా మద్దతు అందిస్తోందన్నారు. ధాన్యానికి బోనస్‌గా రూ.1,780 కోట్లను చెల్లించడంతో పాటు, సన్నవడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు. 26 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసినట్లు గుర్తు చేశారు. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు.
భూ వివాదాల పరిష్కారానికి భూభారతి చట్టం తీసుకువచ్చినట్లు తెలిపారు. మేడారం అభివృద్ధికి రూ.251 కోట్లు కేటాయించడం ద్వారా గిరిజన సంస్కృతి పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, పేదలకు సొంతింటి కలను నెరవేర్చే దిశగా ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తున్నామని గవర్నర్ చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి లక్షల సంఖ్యలో ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో 1.30 కోట్ల కుటుంబాలకు ఉచితంగా సన్నబియ్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని స్పష్టం చేశారు. వైద్య రంగంలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంటూ, 27 ఎకరాల్లో రూ.2 వేల కోట్ల వ్యయంతో కొత్త ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం చేపట్టడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని గవర్నర్ తెలిపారు.

Post a Comment